బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
BRS Party: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు.
రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం మంచిదే. అలాగే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కార్మికులు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని తెలిపారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారన్నారు.
చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఆటో కార్మికులకు నెలకు రూ.10 వేలు జీవన భృతి ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.