MS Swaminathan: ఎంస్ స్వామినాథన్.. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. హరిత విప్లవ పితమహుడు. దేశంలో ఆకలి చావులు ఉండొద్దని భావించి.. తన వృత్తిని వ్యవసాయం వైపు మలుచుకున్నారు. తండ్రి ద్వారా సేవాభావం ఒంట బట్టింది. చదువుకునే రోజుల్లో భయంకరమైన కరువు చూసి.. ఆకలితో అలమటించే పరిస్థితి మళ్లీ రావొద్దని, కొత్త వంగడాలు సృష్టించారు. వరి, గోధుమ వంగడాలను సృష్టించారు. దీంతో హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తుంటారు. వంగడాల కోసం శ్రమించి.. అలసిన స్వామినాథన్ శరీరం నుంచి ఆత్మ వేరు పడింది. మన నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. స్వామినాథన్ నేపథ్యం ఏంటీ..? భారత వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు ఏంటీ..? లెటచ్ వాచ్ దిస్ స్టోరీ.
చదవండి: Air Hostess: గాఢ నిద్రలో యువతి.. పనోడు ఏం చేశాడంటే..?
విద్య
అందరిలాగే స్వామినాథన్ విద్య కొనసాగింది. తండ్రి ప్రభావంతో వైద్యుడు అవ్వాలని అనుకున్నారు. కానీ కరువు, కటకాలు.. అన్నంతో అలమటించి వేలాది మంది చనిపోవడం చూసి.. తన ప్రొఫెసన్ మార్చుకున్నారు. కొత్తవంగడాలు సృష్టించి.. దేశంలో ఆకలు కేకలు లేకుండా చేశారు. భారత వ్యవసాయ రంగంలో వివిధ స్థాయిలో పదవులు చేపట్టి, వాటికే వన్నె తీసుకొచ్చారు. చెన్నైలో ఎంస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు.
వ్యవసాయ కుటుంబం
స్వామినాథన్ పూర్తి పేరు మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్. 1925 ఆగస్ట్ 7వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్సీలో కుంభకోణంలో ఎంకే సాంబశివన్, పర్వతీ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. స్వామినాథన్ తండ్రి వైద్యుడు.. అతని సేవాభావం వల్లే.. ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన వచ్చింది. 11 ఏళ్ల వయస్సులో స్వామినాథన్ ఉండగా తండ్రి చనిపోయారు. అతని బాధ్యత చిన్నాన్నపై పడింది. కుంభకోణంలో గల ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో జరగగా.. తర్వాత క్యాథలిక్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో హైస్కూల్ విద్య సాగింది. పదో తరగతి చదివే వరకు కూడా రైతులతో వ్యవసాయం గురించి మాట్లాడుతుండే వారు. స్వామినాథన్ బాబాయ్ వ్యవసాయం చేసేవారు. వరి, మామిడి, కొబ్బరి పంట పండించేవారు. తర్వాత కాఫీ వంట కూడా వేశారు. పంట ధరలో హెచ్చు తగ్గులు.. అతని కుటుంబంపై ప్రభావం చూపింది. వాతావరణం అనుకూలించకపోవడం, తెగుళ్లతో ఆశించిన ఆదాయం వచ్చేది కాదు.
కరువు
1943లో బెంగాల్లో వచ్చిన కరువు.. స్వామినాథన్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. రెండో ప్రపంచ యుద్దం వల్ల ఆహారం కొరత ఏర్పడింది. పెద్ద దేశంలో ఆహార సమస్యతో ఆలోచనలో పడ్డారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం ఆహార కొరత ఇబ్బంది పడొద్దని.. తన జీవితాన్ని వంగడాల రూపకల్పన కోసం కేటాయించాలని అనుకుని, ఆ దిశగా విద్యను కొనసాగించారు. స్వామినాథన్ ఫ్యామిలీలో అందరూ మెడిసిన్ లేదంటే ఇంజినీరింగ్ చేసే వారు ఉన్నారు. వారికి విభిన్నంగా స్వామినాథన్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని.. యావత్ ప్రపంచం గర్వపడే శాస్త్రవేత్తగా మారారు. త్రివేండ్రంలో గల మహారాజ కాలేజీలో జువాలజీ విభాగంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1940 నుంచి 44 వరకు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో అగ్రికల్చర్ డిగ్రీ చేశారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కోటా రామస్వామి స్వామినాథన్‌కు పాఠాలు బోధించారు.
ఢిల్లీకి రాక
1947లో దేశానికి స్వాతంత్ర్యం రాగా.. అప్పుడే ఆయన ఢిల్లీలో గల ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జన్యుశాస్త్రం, మొక్కల పెంపకాన్ని అధ్యయనం చేశారు. 1949లో జన్యుశాస్త్రంలో పీజీ చేశారు. తర్వాత బంగాళాదుంప సోలనం జాతిపై పరిశోధన చేశారు. అలా కెరీర్ కొనసాగింది. వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేయడం ఫ్యామిలీకి ఇష్టం లేదు. సో.. వారి బలవంతం మేరకు సివిల్స్ రాశారు. ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. ఏం చేద్దాం అని ఆలోచించే సమయంలో నెదర్లాండ్‌లో అద్భుత అవకాశం వచ్చింది. జన్యుశాస్త్రంలో ఫెలోషిప్ చేసే ఛాన్న్ వచ్చింది. యునెస్కో నుంచి ఆఫర్ రావడంతో ఐపీఎస్ వదిలి.. నెదర్లాండ్ వెళ్లారు. అక్కడ 8 నెలలు జెనెటిక్స్ వాగెనింగెన్ అగ్రికల్చర్వర్సిటీలో ఉన్నారు.రెండో ప్రపంచ యుద్దం ఎఫెక్ట్ కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆలుగడ్డల కొరత ఏర్పడింది. పంటలో వ్యత్యాసం ఏర్పడింది. అప్పుడు స్వామినాథన్ పరాన్నజీవులకు వ్యతిరేకంగా స్థితిస్థాపకతను అందించేందుకు జన్యువులను స్వీకరించారు. చల్లని వాతావరణంలో పంట వేసే పరిశోధన చేయడం, ఇతర సూత్రాలు ఫలించాయి. తర్వాత దేశంలో ఇతర పరిశోధనలు చేయడానికి ఇది కారణమైంది. యుద్ధ సమయంలో జర్మనీలో దెబ్బతిన్న మొక్కల పెంపకం కోసం మాక్స్ ఫ్లాంక్ ఇనిస్టిట్యూట్‌ను స్వామినాథన్ సందర్శించాడు. ఆ సమయంలో కొత్త వంగడాల సృష్టి గురించి అతని మనస్సులో బలమైన ఆలోచన వచ్చింది.
వంగడాల సృష్టి
వంగడాల సృష్టి గురించి మరింత అధ్యయనం చేయడానికి స్వామినాథన్ 1950లో బ్రిటన్ వెళ్లాడు. పలు పరిశోధనలు చేసి 1952లో కేంబ్రిడ్జీ వర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ తీసుకున్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. 15 నెలలు అగ్రరాజ్యంలో గడిపారు. పొటాటో రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేయడంలో సాయ పడేందుకు విస్కాన్సిన్ యూనివర్సిటీ, లేబోరేటరీ ఆఫ్ జెనెటిక్స్‌లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్ షిప్‌తో కలిసి పనిచేశారు. ఆ సమయంలో నోబెల్ అవార్డు గ్రహీత జాషువా లెడర్ బర్గ్ వారికి అధ్యాపకులుగా ఉన్నారు. 1953లో పరిశోధన పూర్తి అయ్యింది. అక్కడే జాబ్ ఆఫర్ చేసినప్పటికీ.. స్వామినాథన్ తిరస్కరించారు. దేశంలో వంగడాల సృష్టించడమే అతని జీవిత లక్ష్యం.. అందుకే మంచి ఆఫర్ వదులుకొని భారతదేశం తిరిగి వచ్చేశారు.
పెళ్లి
కేంబ్రిడ్జీలో రీసెర్చ్ చేసే సమయంలో మీనాతో స్వామినాథన్‌కు పరిచయం ఏర్పడింది. అదీ కాస్త ప్రేమగా మారి.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు.. సౌమ్య, మధుర, నిత్య.. వీరు కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. స్వామినాథన్ జీవితాన్ని మహాత్మా గాంధీ, రమణ మహార్షి ప్రభావితం చేశారు. స్వామి వివేకానంద ప్రభావం కూడా ఉంది. తనకు చెందిన 2 వేల ఎకరాల భూమిలో మూడింట ఒక వంతు భూమిని వినోబా భావే కోసం విరాళంగా అందజేసి.. దాతృత్వాన్ని చాటుకున్నారు. 1954లో స్వామినాథన్ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశారు. 3 నెలల తర్వాత కటక్‌లో గల సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ బోటానిస్ట్గా జాబ్ వచ్చింది. తర్వాత కటక్‌లోనే ఇండికా-జపోనికా రైస్ హైబ్రిడైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గోధుమ పంటలో అద్భుత ఫలితాలు సాధించేందుకు దోహదపడింది. అదే ఏడాది ఢిల్లీలో గల ఇండియన్ అగ్రికలరల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్‌లో అసిస్టెంట్ సైటోజెనిటిస్ట్గా పనిచేశాడు. దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని.. అలాంటి సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆశ్చర్యపోయారు. దేశంలో కరువు పరిస్థితి ఏర్పడనుందని ఊహించారు.
అధిక దిగుబడి
నోబెల్ అవార్డు గ్రహీత నార్మన్ బోర్లాగ్‌తో కలిసి స్వామినాతన్ పనిచేశారు. మెక్సికన్ పొట్టి గోధుమ రకాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. వాటిపై పరిశోధనలు చేసి.. అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించారు. దీంతో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పంట అధిక దిగుబడి వచ్చింది. నాణ్యతతో వ్యాధి లేకుండా వచ్చింది. అప్పట్లో అధిక దిగుబడి వచ్చే పంట వేసేందుకు రైతులు ఆలోచించేవారు. దీంతో కొత్త రకం వేసేందుకు స్వామినాథన్‌కు నిధులు మంజూరు అయ్యాయి. హెక్టార్లో 150 ప్రదర్శన వంగడాలు వేశారు. వేసిన పంట చక్కగా వస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందడం మానేశారు. దేశంలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగశాలలో ధాన్యానికి మార్పులు చేశారు. కొత్త గోధుమ రకం ఉత్పత్తి 1968లో 17 మిలియన్ టన్నులకు చేరింది. అంతకుముందు రైతులు హెక్టార్ స్థలంలో సాగు చేసే కంటే 5 టన్నులు ఎక్కువగా వచ్చింది. స్వామినాథన్‌తో కలిసి పనిచేసిన నార్మన్ బోర్లాగ్‌కు 1970లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆ సమయంలో స్వామినాథన్‌ను ఉద్దేశిస్తూ ఇలా రాశాడు. ఒక టీమ్‌గా ఉండి హరిత విప్లవం సాధ్యమైంది. భారతీయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ముఖ్యంగా స్వామినాథన్ అంటూ లేఖలో పేర్కొన్నారు. మెక్సికన్ మరుగుజ్జు సంభావ్య విలును ముందుగా గుర్తించింది స్వామినాథన్ అని తెలిపారు. లేదంటే ఆసియాలో హరిత విప్లవం వచ్చేది కాదన్నారు. భారత వ్యవసాయ శాస్త్రవేత్తలు గురుదేవ్ ఖుస్, దిల్బాగ్ సింగ్ అథ్వాల్ సహకారం అందించారని గుర్తుచేశారు. 1971లో భారతదేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ప్రకటించింది. భారత్, స్వామినాథన్ ఆకలి, ఆహారం, పౌష్టికాహారం, ఇతర సమస్యలపై దృష్టిసారించగలరని తెలిపారు. అతను చెప్పినట్టుగానే 1954 నుంచి 1972 వరకు స్వామినాథన్ ఐఏఆర్ఐలో పనిచేసి.. సరికొత్త వంగడాలను సృష్టించారు. ఆకలితో అలమటించలేని పరిస్థితిని సృష్టించాడు.
అధ్యయనం
బంగాళాదుంప అవసరాల దృష్ట్యా మూలంపై 1950లో స్వామినాథన్ అధ్యయనం చేశారు. కణ విభజన గురించి శోధించారు. అడవీ జాతి నుంచి పండించిన బంగాళాదుంప జన్యువులను బదిలీ చేయగల సామర్థ్యాన్ని ఎక్కువని గుర్తించారు. కొత్త కొత్త ఆలుగడ్డలను రూపొందించారు. విస్కాన్సిన్ వర్సిటీలో చేసిన రీసెర్చ్ ఇక్కడ ఉపయోగపడింది. 1950, 1960లో హెక్సాప్లోయిడ్ గోధుమలు, సైటోజెనెటిక్స్‌పై ప్రాథమిక పరిశోధనలు చేశారు. స్వామినాథన్, బోర్లాగ్ డెవలప్ చేసిన గోధుమలు, వరి వంగడాలు హరిత విప్లవానికి పునాది వేశాయి. కిరణ జన్య సంయోగ క్రియ, నీటి వినియోగం అనుమతించే సీ4 కార్బన్ స్థిరీకరణ సామర్థ్యాలతో వరిని పెంచే ప్రయత్నాలు స్వామినాథన్ నేతృత్వంలో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థలో ప్రారంభించారు. ప్రపంచంలో అధిక దిగుబడినిచ్చే బాస్మతి అభివృద్ధిలో స్వామినాథన్ పాత్ర ఉంది. ఆ తర్వాత కాలంలో పలు మేలైన వరి వంగడాలను రూపకల్పన చేశారు. ఇతర దేశాలకు చెందిన మేలైన వరి రకాలను దేశంలో ప్రవేశపెట్టి.. వాటి నుంచి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన విశేష కృషి వల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవాన్ని సాధించింది. దేశం ఆహార కొరతతో ఉన్న సమయంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేశాడు. దీంతో తక్కువ ఆదాయం కలిగిన రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి వీలయ్యింది.
అవార్డులు
1972 నుంచి 79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు స్వామినాథన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1980 వరకు వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1982 నుంచి 1988 వరకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఏసియా వ్యక్తుల జాబితాలో టైమ్ 20 పర్సన్లో స్వామినాథన్ నిలిచారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన కృషిని భారత ప్రభుత్వం గౌరవించింది. పద్మ శ్రీ, పద్మ భూషన్ అవార్డులతో సత్కరించింది. 1987లో వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ అవార్డు వరించింది. హెచ్ కే ఫిరోదియా అవార్డ్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ఫ్రైజ్ అందుకున్నారు. 1971లో రామన్ మెగసేసె అవార్డు, 1986లో అల్బర్డ్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ విశేష సేవలు చేశారు. తన జీవితాన్ని అంకితం చేసి.. కొత్త వంగడాలను సృష్టించారు. కెరీర్ పరంగా ఉన్నత పదవులను అధిరోహించారు. పలు అవార్డులను స్వీకరించి.. వాటికే వన్నె తీసుకొచ్చారు.