Papua New Guinea: కొండచరియలు విరిగిపడి.. రెండువేల మంది దుర్మరణం
పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 2,000 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ ఐరాసకు లేఖ రాసింది.
Papua New Guinea: నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంగా ప్రావిన్స్‌లో విధ్వంసం సంభవించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి అధికారి తెలిపిన విరాల ప్రకారం ముందు ఈ ప్రమాదంలో 670 మందికి పైగా మరణించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. తాజా లెక్కల ప్రకారం రెండు వేల మందికి పైగానే ఈ ప్రమాదంలో మరణించారని ఈ దేశపు నేషనల్ డిజాస్టర్ సెంటర్ ఐరాసకు (United Nations) వెల్లడించింది. అంతే కాదు కొండచరియలు విరిగిపడటం వల్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వ్యవసాయ భూమి, నీటి సరఫరా దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం నాలుగు వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. ఈ మేరకు పాపునా న్యూ గినియా దేశ డిజాస్టర్ సెంటర్ ఐరాసకు సోమవారం లేఖ రాసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2,000 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అని అందులో పేర్కొంతది. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. ఆహారం, పంటలపై తీవ్ర ప్రభావం పడిందని తద్వారా దేశ ఆర్థిక జీవనరేఖ దెబ్బతిన్నదని జాతీయ విపత్తు కేంద్రం లేఖలో పేర్కొంది.