»Cyclone Remal Highlights Heavy Rains In West Bengal And Parts Of Bangladesh
Cyclone : తీరం దాటిన రెమాల్ తుపాను.. ఏడుగురు మృతి
రెమాల్ తుపాను ఈ తెల్లవారు జామున తీరం దాటింది. తీరం దాటే సమయంలో మన దేశంలోని బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా గాలులు వీచాయి. పెద్ద ఎత్తున వర్షాలూ కురిశాయి.
Remal Cyclone Update : బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను(REMAL CYCLONE) ధాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లు అతలాకుతలం అయ్యాయి. ఈ తుపాను తీరం దాటుతున్న సమయంలోపెద్ద ఎత్తున గాలులు వీచాయి. గంటలకు 135 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున వర్షాలు సైతం కురిశాయి. ఫలితంగా కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించాయి. ఈ తుఫాను దాటికి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వేరు వేరు ఘటనల్లో ఏడుగురు మరణించారు.
తుపాను తీరం దాటుతున్న సమయంలో తీవ్ర గాలులు వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఓ ఇంటి కప్పు కూలి పడటంతో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా లక్ష మందిని అధికారులు ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ తుపాను(CYCLONE) కారణంగా ఆదివారం కోల్‌కతా విమానాశ్రయంలో విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తుపాను సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వర్షాల కారణంగా ఇబ్బందుల పాలు అవుతున్న వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహార పొట్లాలు, తాగు నీటిని సరఫరా చేస్తోంది. వర్షం తగ్గుముఖం పడితే సహాయక చర్యలు మరింత వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు.