Remal : ఈశాన్య రాష్ట్రాల్లో తుపాను మిగిల్చిన విషాదం.. 27మంది మృతి
రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు.. ఈశాన్య రాష్ట్రాలు సైతం తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
Remal Cyclone : రెమాల్ తుపాను వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వీటి ప్రభావం అక్కడ వేరు వేరు ఘటనల్లో మొత్తం 27 మంది మృతి చెందారు. రెమాల్ తుపాను తీరం దాటి మూడు రోజులు కావొస్తున్నా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇంకా చక్కబడలేదు. మిజోరాంలోని అయిజోల్లో రాతి క్వారీ కూలి మొత్తం పద్నాలుగు మంది మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
అస్సాంలో తుపాను(Cyclone) దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపోయాయి. ఇలాంటి ఘటనల్లో అక్కడ మొత్తం నలుగురు ప్రాణాలు విడిచారు. హ్లిమెన్ ప్రాంతంలో వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఐదుగురు ప్రాణాల్ని కోల్పోయారు. మరో నలుగురు కనిపించకుండా పోయారు. అక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంగళవారం వరకు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో(North Eastern States) భారీ వర్షాలు కురిశాయి. బుధవారం కూడా అక్కడ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాతి క్వారీ కూలిన ఘటనలో మృతి చెందిన 14 మంది కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు మిజోరాం సీఎం ప్రకటించారు. అలాగే మిజోరాంలో ఉన్న పాఠశాలలు అన్నింటికీ సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం రూ.15 కోట్లు కేటాయించారు.