Heat Waves : ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడి, వేడిగాలులను ఎదుర్కొంటున్నాయి. ఈ సంవత్సరం వేడిగాలులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో వేడి కారణంగా రికార్డు స్థాయిలో 143 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 41,789 మంది వడదెబ్బకు గురయ్యారు. ఈ గణాంకాలు మార్చి 1 నుంచి జూన్ 20 వరకు ఉండటం గమనార్హం. వేడి-సంబంధిత అనారోగ్యం, మరణాలను పర్యవేక్షించే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అనేక రాష్ట్రాలకు సంబంధించిన డేటాను ఇంకా అప్డేట్ చేయనందున హీట్ వేవ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, అనేక ఆరోగ్య కేంద్రాలు హీట్‌వేవ్ కారణంగా మరణించిన వారి డేటాను ఇంకా అప్డేట్ చేయలేదు.
ఒక్కరోజే 14 మంది మృతి
అధికారిక లెక్కల ప్రకారం ఒక్క జూన్ 20వ తేదీన వడదెబ్బ కారణంగా 14 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీంతో మార్చి-జూన్‌లో ఎండ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య 143కి చేరింది. అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఇక్కడ అత్యధిక మరణాల సంఖ్య 35. అదే సమయంలో వేడిగాలుల కారణంగా ఢిల్లీలో 21 మంది, బీహార్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు 17 మంది చనిపోయారు. హీట్‌వేవ్‌తో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక యూనిట్లను రూపొందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్ని ఆసుపత్రులకు సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్లి ఈ ప్రత్యేక యూనిట్లను తనిఖీ చేయాలని ఆరోగ్య మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, వేడిగాలుల కారణంగా మరణాలను సమీక్షించాలని కూడా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
హీట్ స్ట్రోక్ లక్షణాలు
దేశంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుం దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొంటున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల వడదెబ్బ ప్రమాదం పెరుగుతుంది. విపరీతమైన వేడిని తట్టుకునే అలవాటు లేని వ్యక్తులు వడదెబ్బ కు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది లేదా కొన్నిసార్లు దానిని మించిపోతుంది. హీట్‌స్ట్రోక్ లో రోగికి తీవ్రమైన తలనొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, వాంతులు లేదా వికారం, మాట్లాడటంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు ఉండవచ్చు.