»Bodies Of 45 Indians Who Died In Kuwait Fire Reach Kerala
Kuwait Fire : భారతీయుల మృతదేహాలతో కేరళకు చేరిన విమానం
కువైట్‌లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృత దేహాలను భారత వైమానిక దళ విమానం కేరళకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Kuwait Fire : బుధవారం కువైట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా 45 మంది భారతీయులు (Indians) ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. వీరి మృత దేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన విమానం కేరళలో(Kerala) ల్యాండ్ అయ్యింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
చనిపోయిన వారిలో తమిళనాడు వారు ఏడుగురు, కేరళవారు 12 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉన్నారు. ఆయా మృత దేహాలను కొచ్చిలో దించి ఆ విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్‌పోర్టులో దించిన వెంటనే మృతులకు అక్కడి అధికారులు నివాళులు అర్పించారు. తర్వాత సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో ఎక్కించి వారి స్వగ్రామాలాకు తరలిస్తున్నారు.
కువైట్‌లోని మంగఫ్ సిటీలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఈ అతి పెద్ద భవంతిలో 196 మంది వర్కర్లు నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మరణించారు. వారిలో 45 మంది భారతీయులే కావడం గమనార్హం. మరో 56 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.