Gold and Silver Rates Today : పసిడి, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనా వీటి ధరలు పెరిగినంత ఎక్కువగా తగ్గడం లేదనే చెప్పాలి. ఒక రోజు భారీగా బంగారం ధర పెరిగి మరుచటి రోజు అందులో పావు వంతు మాత్రమే తగ్గుముఖం పడుతోంది. గత రెండు మూడు నెలలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో ఈ రెండు లోహాలు రికార్డు ధరలకు కాస్త తక్కువగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.73,500కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లోనూ పసిడి ధర (Gold Rate) నేడు రూ.73,500గానే కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనవి మాత్రమే. తర్వాత ఇవి మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నగలు కొనుక్కునే సమయంలో ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివీ తోడవుతాయి.
ఇక వెండి ధరలు (Silver Rates) శుక్రవారం రూ.530 తగ్గాయి. దీంతో దీని ధర చాలా రోజుల తర్వాత మళ్లీ 90వేల దిగువకు చేరుకుంది. నేడు దీని ధర రూ.89,650కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా మార్కెట్ ప్రారంభ సమయానికి వరుసగా రెండో రోజూ తగ్గడం మంచి సూచనే అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం నేడు తగ్గాయి. శుక్రవారం ఆరు డాలర్లు తగ్గి ఔన్సు స్పాట్ గోల్డ్ 2306 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 29 డాలర్లు పలుకుతోంది.