»Supreme Court Key Comments Of Supreme Court On Monthly Leave
Supreme Court: నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court: Key comments of Supreme Court on monthly leave
Supreme Court: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే. కానీ దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వాళ్లు ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ప్రోత్సహించినట్లు అవుతుంది. అయితే వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చని తెలిపింది. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గవచ్చు. మేం అది కోరుకోవట్లేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్యలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్ దాఖలవగా దానిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. ఇక, ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్ లీవ్ ప్రకటించింది.