తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటి మహమ్మారి అని, దాన్ని నిర్మూలించకపోతే ప్రమాదమని ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మాట్లాడారు. సనాతన ధర్మంపై ఉదయనిధి కంటే ముందుగా కొందరు మాట్లాడారని, అప్పట్లో దానిపై కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ అందరికంటే చిన్నవాడైన ఉదయనిధిని వెంటాడుతున్నారని కమల్ విచారం వ్యక్తం చేశారు.
సనాతన అనే పేరు పెరియార్ ద్వారా వచ్చిందని, సనాతన ధర్మం గురించి అందరికీ తెలిసిందంటే అది పెరియార్ వల్లనే అని కమల్ హాసన్ తెలిపారు. పెరియార్ వారణాసిలో నుదుటన తిలకం దిద్దుకుని ఓ ఆలయంలో పూజలు చేస్తుండేవాడని, కానీ అవన్నీ విడిచిపెట్టి ఆయన ప్రజాసేవకు అంకితం అయ్యారంటే ఆయనకు పరిస్థితులు ఎంత కోపం తెప్పించాయో అందరూ ఆలోచించాలన్నారు. ఉదయనిధి స్టాలిన్‌పై అందరూ విరుచుకుపడటం అంత మంచిది కాదన్నారు.