ఆసియా కప్(Asia Cup)లో మంచి జోరు మీద ఉన్న భారత్ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఢీ కొట్టనుంది. సూపర్-4లో ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంకలపై సాధించిన టీమిండియా ఫైనల్‌కి దూసుకెళ్లింది.ఆడిన రెండు మ్యాచ్‌ల్లోను ఓడిన బంగ్లాదేశ్ (Bangladesh) పైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ప్రయోగాలు చేసే అవకాశముంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. ఇతర క్రికెటర్లను పరీక్షించే ఆస్కారముంది. వచ్చే నెలలో ప్రపంచకప్ (World Cup) ఆరంభం నేపథ్యంలో తొలి ప్రాధాన్య జట్టుకే మరింత మ్యాచ్ సమయం ఇవ్వాలా? లేదా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలా? అనే సందిగ్ధంలో జట్టు మేనేజ్మెంట్ ఉందనే చెప్పాలి. మరోవైపు సూపర్- 4లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (పాక్, శ్రీలంకపై)నూ ఓడిన బంగ్లాదేశ్.. గెలుపుతో టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఉంది. అందుకే బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు.
బంగ్లాదేశ్‌తో పోరు కంటే కూడా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడతాడా? అనేదానిపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. వెన్నునొప్పికి శస్త్రచికిత్స నుంచి కోలుకున్న అతను ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తిరిగి ఆసియా కప్‌తోనే పునరాగమనం చేసిన శ్రేయస్.. పాకిస్థాన్(Pakistan)పై లీగ్ మ్యాచ్‌లో 14 పరుగులు చేశాడు. నేపాల్‌పై బ్యాటింగ్ చేసే అవసరమే రాలేదు. ఆ తర్వాత వెన్ను నొప్పితో సూపర్- 4లో రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తున్న శ్రేయస్ బంగ్లాతో మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. నెట్స్‌లోనూ అతను సౌకర్యవంతంగానే బ్యాటింగ్ చేశాడు. అతనొస్తే ఇషాన్ కిషన్ బయటకు వెళ్లక తప్పదు. మరోవైపు కోహ్లీకి విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ (Suryakumar) ను ఆడించే సూచనలూ ఉన్నాయి. పునరాగమనంలో పాకిస్థాన్‌పై అజేయ శతకంతో పాటు శ్రీలంకపైనా రాణించిన కేఎల్ రాహుల్ జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ కూడా లయ అందుకున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్, జడేజా.. బంతితో పాటు బ్యాట్‌తోనూ అంచనాలు అందుకోవాల్సి ఉంది. పిచ్ మరోసారి స్పిన్‌కే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడం భారత్‌కు కీలకం.
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ప్లేయర్లంతా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తుండటంతో.. భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అంటే తెలంగాణ యువ కెరటం ఠాకూర్ తిలక్ వర్మ (Tilak Verma) కు ఇప్పట్లో వన్డే అరంగేట్రం చేసే చాన్స్ లేనట్లే. వెస్టిండీస్ పర్యటనలో పొట్టి ఫార్మాట్లో దంచికొట్టి.. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ తిలక్ ఆ వెంటనే వన్డే పిలుపు అందుకున్నాడు. అయితే ఆసియాకప్‌నకు ముందు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (KL Rahul) కోలుకోవడంతో తిలక్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్ తో పోరు నామమాత్రమే కావడంతో అతడికి అవకాశమిస్తారా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే అనిపిస్తున్నది. మరో కీలక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ టోర్నీలో ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్/రాహుల్, ఇషాన్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా/షమీ.
ఆసియాకప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణుడు ఈ మ్యాచ్‌ను కూడా వదిలేలా లేడు. శుక్రవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Dept) తెలిపింది. పిచ్ కాస్త స్లోగా ఉండనుంది. స్పిన్నర్లకు సహకారం లభించే చాన్స్ ఉంది.