»Ips Prabhakar Chaudhary Was Transferred 18 Times In His 8 Years Of Service
IPS: నిజాయితీకి 8 ఏళ్లలో 18 బదిలీలు..!
8 ఏళ్ల తన పదవి కెరియర్లో ఓ అధికారి ఏకంగా 18 సార్లు బదిలీ అయ్యారు. ఎక్కడికి వెళ్లినా కూడా అక్రమ పనులు చేసిన వారి ఆటకట్టిస్తూ దూసుకెళ్తున్నారు. అతనే ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ చౌదరి. అక్రమమార్గంలో వెళుతున్న కావడి యాత్రికులపై లాఠీచార్జీకి అనుమతిచ్చినందుకు రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు.
IPS Prabhakar Chaudhary was transferred 18 times in his 8 years of service.
IPS: దేశంలో సిన్సియర్‌గా పని చేసే అధికారులకు అనాదిగా జరుగుతున్న సత్కారాలలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. ప్రజలకు సర్వీస్(Public service) చేయాలని ఎంతో మంది ఉన్నతాధికారులు చట్టపరమైన నియమాలను అవలంభించి స్థానిక పాలకుల ఆగ్రహానికి గురవుతారు. ఫలితంగా బదిలీ అవుతారు. అదేదో సినిమాలో పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోయేది పోలీస్టేషన్‌కే కానీ పోస్ట్ ఆఫీస్‌కు కాదు. అన్నట్లు ఈ నిజాయితీ గల అధికారులు కూడా వారి నిబద్ధతలో, వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పులి ఎక్కడున్నా పులినే అన్నట్లు ఉంటుంది వీరి వ్యవహారం.
ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా(Ashok Khemka) ఈ పేరు వినగానే ఆయన నిజాయితీతో పాటు ఆయన ట్రాన్స్ఫర్స్ గుర్తుకు వస్తాయి. 30 సంవత్సరాల తన పదవిలో 55 సార్లు బదిలీ(transfer) అయిన ఆఫీసర్ ఆయన. IAS అధికారి అశోక్ ఖేమ్కా తాను పనిచేసిన దాదాపు ప్రతి శాఖలో అవినీతి, జాతీయ కుంభకోణాలను వెలికితీశారు. తర్వాత బదిలీ చేయబడ్డారు. ఇలా దేశతంలోనే ఎక్కువసార్లు ట్రాన్స్ఫర్ అయిన అధికారిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఇదే తరహాలో మరో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ చౌదరి వార్తల్లో నిలుస్తున్నారు.
2010 బ్యాచ్‌కు చెెందిన ఈ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ చౌదరి(Prabhakar Chaudhary) గడిచిన 8 ఏళ్లలో 18 సార్లు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ జిల్లాలో అనధికార మార్గంలో ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన కన్వారియాల(Conwariyala) గుంపుపై (కావడి యాత్రికులు) లాఠీఛార్జీకి అనుమతిచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ చౌదరిని అక్కడి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. ఆదివారం కొందరు కన్వారియాలు బరేలి జిల్లా మీదుగా కావడియాత్ర నిర్వహించారు. దీనికోసం అనుమతులు తీసుకోలేదు. సున్నిత ప్రాంతమైన జోగి నడవా గుండా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కన్వారియాలు పోలీసులకు వ్యతిరేకంగా, మరో వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారు.
దాదాపు ఆరు గంటలు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుమతితో పోలీసులు లాఠీఛార్జి చేసి గుంపును చెదరగొట్టారు. దీంతో అనుమతిచ్చిన ఎస్పీ ప్రభాకర్ చౌదరిని ఉన్నతాధికారులు లఖ్‌నవూలోని 32వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ బెటాలియన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారి నిజాయితీని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఇలాంటి ఆఫిసర్స్ ఉన్నారు కాబట్టే అవినీతిపరుల ఆగడాలు కొంతైన అదుపులో ఉన్నాయని అంటున్నారు.