»Fighting In Prison 41 Women Prisoners Died At Honduras
Honduras: జైళ్లో ఫైటింగ్..41 మంది మహిళా ఖైదీలు మృతి
హోండురాస్(honduras)లోని మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది మహిళలు చనిపోయారు. వీరిలో అనేక మంది అగ్నికి ఆహుతి కాగా. ఇంకొంత మంది బాధితులు కాల్చివేయబడ్డారు.
హోండురాస్(honduras) మహిళా జైలు(women prisoners)లో జరిగిన హింస, అగ్నిప్రమాదంలో మంగళవారం 40 మందికి పైగా మృత్యువాత చెందారు. రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో పెద్ద ఎత్తున మంటలు చేలరాయి. ఈ ఘర్షణల్లో 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మందికి బుల్లెట్ గాయాలై ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు మరో ఏడుగురు ఖైదీలు గాయపడ్డారు. గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో ఖైదు చేయబడిన మహిళల బంధువులు వందలాది మంది వారి ఆత్మీయుల కోసం జైలు(jail) వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ క్రమంలో భారీగా సాయుధ బలగాలతోపాటు, పోలీసులు కూడా మోహరించి జైలులో పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక బృందాలు కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక ముఠా సభ్యులు ప్రత్యర్థి సమూహంలోని సెల్‌లోకి ప్రవేశించి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటల్లో జైలులోని ఓ భాగం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు పేర్కొన్నారు. 18 గ్యాంగ్‌కు చెందిన ఖైదీలు సెల్ బ్లాక్‌లోకి ప్రవేశించి ఇతర ఖైదీలను కాల్చి చంపారని జైల్లో ఉన్న ఓ ఖైదీ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై హోండురాన్ ప్రెసిడెంట్ జియోమారా కాస్ట్రో స్పందించారు. అల్లర్ల అంశంపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.