Vande Bharat: డెహ్రాడూన్ నుంచి వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ముజఫర్‌నగర్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఒక్కసారిగా రాళ్లదాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇలా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రైల్వేశాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని వెలుగులోకి వచ్చింది.
ఇది చాలా దురదృష్టకర సంఘటన అని రైల్వే బోర్డు ఈడీపీఐ అమితాబ్ శర్మ అన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. రైల్వేలు దేశ సొత్తు అని, రైలులో జరిగే నష్టాన్ని ప్రజల సొమ్ముతోనే భర్తీ చేస్తారన్నారు. ఇలాంటి ఘటనల్లో తమ ప్రమేయం ఉండకూడదని రైల్వే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 2019 సంవత్సరం నుండి వందే భారత్ ట్రాక్‌లో పరుగు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు రాళ్లు రువ్వారు. రైల్వేలో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ రైలుపై ఇప్పటివరకు 210 సార్లు రాళ్లు రువ్వారు. 2019లో ఈ వ్యవహారంపై రైల్వే శాఖ 28 కేసులు నమోదు చేసింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 93 కేసులు నమోదయ్యాయి.
రైల్వే వర్గాల ప్రకారం, 2019 సంవత్సరం నుండి రాళ్లదాడికి పాల్పడినందుకు 106 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63 మందిని అరెస్టు చేశారు. రైళ్లపై రాళ్లు రువ్వడం చట్ట విరుద్ధమని రైల్వే వర్గాలు తెలిపాయి. ఎవరైనా ఇలా చేస్తూ పట్టుబడితే, అతనిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేస్తారు. ఇది నాన్ బెయిలబుల్.. ఈ సెక్షన్ కింద బుకింగ్ కోసం ఎలాంటి వారెంట్ అవసరం లేదు. ఇందులో ఎవరైనా దోషులుగా తేలితే ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.
రాళ్లతో కొట్టిన వ్యక్తిని ఎలా పట్టుకుంటారు?
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. నిందితులను పట్టుకోవడానికి రైలులో అమర్చిన బాహ్య CCTV సహాయం తీసుకోబడింది. పట్టుకోలేకపోయినా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.