మంగళగిరి(Mangalagiri)లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)హోమం, యజ్ఞ పూజలు నిర్వహించారు. అంత ముందు పార్టీ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి పవన్ భూమి పూజ (Bhumi Puja) చేశారు.రెండు రోజుల పాటు సాగే యాగాన్ని ఈ రోజు ఉదయం 6.55 గంటలకు ప్రారంభించారు.ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ (Hariprasad) పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘‘పవన్ పట్టు వస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు.
గణపతి పూజ(Ganapati Puja)తో యాగానికి అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. ఈ యాగం రేపు కూడా కొనసాగనుంది’’ అని అందులో తెలిపారు. పవన్ యాగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేశారు. మరోవైపు ఏపీలో జూన్ 14 నుంచి 23 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం (Annavaram) నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం (Bhimavaram) వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో పవన్ చేపట్టిన యాగం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులు స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు(Shiva Parvati), ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు.