»Karnataka Elections Masabinal Village Destroyed Electronic Voting Machines
Karnataka Elections: కర్ణాటకలో పోలింగ్ వేళ హింస.. ఈవీఎంలు, అధికారుల వాహనాలు ధ్వంసం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తయింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కానీ కొన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తయింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్(poling) ప్రశాంతంగా ముగిసింది. కానీ కొన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. విజయపుర జిల్లా(Vijayapura District) బసవన బాగేవాడి తాలూకాలోని మసబినాల్ గ్రామంలోని ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(Electronic Voting Machines), వీవీప్యాట్(VVPAT) లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
అధికారులు వీవీప్యాట్లు, ఈవీఎం(EVM)లు మారుస్తున్నారనే పుకార్లు రావడంతో గ్రామస్తులు ఆగ్రహించి ఈ చర్యలకు పూనుకున్నారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గంలోని పాపయ్య గార్డెన్లోని పోలింగ్ బూత్(Polling booth)లో కొందరు యువకులు కర్రలతో తమ తమ ప్రత్యర్థులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన మహిళలు గాయపడ్డారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మరోవైపు బళ్లారి జిల్లా సంజీవరాయలకోట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక, బళ్లారి రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. ఉమేష్ యాదవ్ గతంలో బీజేపీలో కొనసాగి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.