అధికారులు కేసీఆర్ కి బానిసలుగా పనిచేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇటీవల బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటనపై తాజాగా స్పందించిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
చీఫ్ సెక్రటరీ స్కెచ్ వేసుకొని దాడులకు పాల్పడుతున్నారని, ఐఏఎస్, ఐపీఎస్‌లు అక్రమాలకు అడ్డాలుగా మారారని ఆరోపించారు. అధికారులు రాజ్యాంగబద్ధంగా పని చేయకుండా కేసీఆర్‌కి బానిసలాగా పని చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. మాజీ నక్సలైట్లను ఎస్ఐబీతో శిక్షణ ఇప్పించి దాడులు చేయాలని అదేశిస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలపై కేంద్రానికి అన్ని విషయాలపై నివేదిక ఇస్తామని రాజేందర్ తెలిపారు.
శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే సరైన సమయంలో కేంద్రం స్పందిస్తుందని రాజేందర్ అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయండని, పోలీసులు మీకు అండగా ఉంటారని కేసీఆర్ చెప్పారని ఈటల ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉన్న ఓ మహిళ కొట్టి కొట్టి చంపుతానని అనడం దుర్మార్గమని రాజేందర్ అన్నారు.