»Sukesh Chandrasekhar Drops Another Letter Bomb On Kejriwal And Brs Party
మరో బాంబు పేల్చిన Sukesh.. ఇరుక్కున AAP, BRS పార్టీలు
జైల్లో ఉన్న ఖైదీతో బీజేపీ లేఖలు విడుదల చేసి రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుఖేశ్ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
అధికార భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi- BRS Party) పార్టీ ఇరుకున పడింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్టై ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో బాంబు పేల్చాడు. నాటి టీఆర్ఎస్ పార్టీకి రూ.75 కోట్ల నగదు ఇచ్చానని సంచలన ప్రకటన చేశాడు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సూచన మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆ నగదు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ మేరకు జైలు నుంచి ఓ లేఖ (Letter) విడుదల చేశాడు. ఆ లేఖలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
జైలులో (Tihar Jail) ఉన్న సుఖేశ్ తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఈ లేఖను విడుదల చేశాడు. లేఖలో ఏమున్నదంటే.. ‘2020లో హైదరాబాద్ (Hyderabad)లోని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) కార్యాలయంలో ‘ఏపీ’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందించాలని అరవింద్ కేజ్రీవాల్, అప్పటి మంత్రి సత్యేంద్ర జైన్ నాకు చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో (Liqour Scam) భాగస్వామిగా ఉన్న ఏపీ అనే వ్యక్తికి టీఆర్ఎస్ కార్యాలయంలో రూ.75 కోట్లు అందించా. ఒక్కో పెట్టెలో 155 కిలోల నెయ్యి (కోడ్ భాషలో రూ.15 కోట్లు) ఉందని, మొత్తం 5 పెట్టెలు (రూ.75 కోట్లు) హైదరాబాద్ లో సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ చెప్పడంతో వాటిని టీఆర్ఎస్ కార్యాలయంలో రేంజ్ రోవర్ కారులో కూర్చున్న సంబంధిత వ్యక్తికి చేరవేశా.’ అని లేఖలో సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపాడు.
‘కేజ్రీవాల్ చాలా అవినీతిపరుడు. అతడి బాగోతం బహిర్గతం చేస్తా. నేను, కేజ్రీవాల్ పరస్పరం చేసుకున్న సందేశాలను బయటకు విడుదల చేస్తా. 700 పేజీల వాట్సప్, టెలిగ్రామ్ చాటింగ్ నా వద్ద ఉంది. నేను బయటపెట్టే వాస్తవాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడం ఖాయం. అరవింద్ కేజ్రీవాల్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. త్వరలో తీహర్ క్లబ్ లో చేరబోతున్నాడు ’ అని సుఖేశ్ వెల్లడించాడు. కాగా ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితీ సింగ్ నుంచి రూ.200 కోట్లు బలవంతంగా వసూలు చేసిన కేసులో గతేడాది సుఖేశ్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు రూ.10 కోట్లు, ఆప్ కు రూ.60 కోట్లు అందజేశానని తెలిపాడు.
కాగా సుఖేశ్ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఖండించాయి. బీజేపీ దురుద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు సుఖేశ్ తో చేయిస్తోందని మండిపడ్డాయి. జైల్లో ఉన్న ఖైదీతో బీజేపీ లేఖలు విడుదల చేసి రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుఖేశ్ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.