Three Year Old Child : కార్ డోర్ లోపలి నుంచి లాక్ కావడంతో ఆడుకోడానికని కారులోకి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తెలంగాణ, భద్రాద్రి కొత్త గూడెం( Bhadradri Kothagudem) జిల్లాలో చోటు చేసుకుంది. మణుగూరు మండలం సాంబాయి గూడెంకు చెందిన ఓ ఇంట్లో ఈ విషాదం నెలకొంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న ఓ చిన్నారి సరదాగా కారులోకి వెళ్లి డోర్లు లాక్ వేసుకుంది. ఎవరూ చూడకపోవడంతో ఊపిరాడక కారులోనే విగత జీవిగా మారింది.
ఆ చిన్నారి పేరు కల్నీష. అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. చాలా సేపైనా ఎక్కడా చప్పుడు లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్కల అంతా చూశారు. ఎంతకీ కనిపించకపోయే సరికి కంగారు పడ్డారు. అంతా గాలించినా ఫలితం లేదు. దీంతో ఇంటి దగ్గర చూసేసరికి అకస్మాత్తుగా కారులో పాప కనిపించింది. వెంటనే కారు(Car) డోర్లు తెరచి చూశారు. అయితే బిడ్డ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి ఇలా కారులో ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన కేసుగా వారు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.