Boat capsizes in Ujani dam : వేసవి కాలంలో వస్తున్న అకాల వర్షాలు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం వీచిన భారీ ఈదురు గాలులు, వర్షాల వల్ల ఓ బోటు(boat) మునిగిపోయింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న ఉజని డ్యామ్(Ujani dam) బ్యాక్ వాటర్లో చోటు చేసుకుంది ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారని బుధవారం స్థానిక అధికారులు తెలియజేశారు.
మంగళవారం ఆ ప్రాంతంలో భారీ వర్షం, ఈదురు గాలులు వీచాయి. ఈ బ్యాక్ వాటర్లో కలాషి, భుగవ్ గ్రామాల మధ్య బోట్లు నడుస్తుంటాయి. అలా ఆ బోటులో(boat) మొత్తం ఏడుగురు ఎక్కారు మధ్యలోకి వెళ్లాక అది గాలుల కారణంగా బోల్తా పడింది. ఇందులో ఒక అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైతం ఉన్నారు. ఆయన నీటిని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మిగిలిన వారు చనిపోయారని స్థానిక అధికారులు చెబుతున్నారు. మృత దేహాలను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. వారికి స్థానికులు సైతం సహాయం చేస్తున్నారు. గాలులు వీస్తుండటం వల్ల సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.