Road Accident : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపుగా పదిహేను మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అనూహ్య రీతిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయిన వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
ఘటన ఎలా జరిగిందంటే…
శనివారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లా కావలి(Kavali) ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ వచ్చి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ పక్కకు పడిపోయింది. వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ అవతలి వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జయ్యింది. దీంతో మూడు వాహనాల్లో కలిపి మొత్తంగా ఆరుగురు మృతి చెందారు. గాయ పడిన వారు దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.