ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్యూటిషియన్ (Beautician).. తెలంగాణకు చెందిన యువకుడికి మధ్య ఫేస్ బుక్ (Facebook)లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్లు గడిచాయి. ఈలోపు యువతికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీనిపై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. ఫలితంగా ఆమె బ్యూటీ పార్లర్ (Beauty Parlour)లోనే ఆ స్నేహితుడు ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేయగా.. ఆపై అతడు బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు (Chittoor) పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరులోని పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ (Head Constable)గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు చిన్న కుమార్తె దుర్గా ప్రశాంతి (23). పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఎం ఫార్మసీ పూర్తి చేసిన ప్రశాంతి గతేడాది హైదరాబాద్ లో బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుంది. చిత్తూరులో కొన్ని నెలల కిందట సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించింది. రెండేళ్ల కిందట ప్రశాంతికి తెలంగాణలోని భదాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem District) జిల్లాకు చెందిన చక్రవర్తి (31) ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. రెండేళ్ల దుబాయ్ లో వంట మాస్టర్ గా పని చేశాడు. రెండు నెలల కిందట చక్రవర్తి దుబాయ్ నుంచి వచ్చాడు. తన తల్లిని తీసుకువచ్చి చిత్తూరులో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టాడు. ఒకే నగరంలో ఉండడంతో ప్రశాంతి, చక్రవర్తి తరచూ కలుసుకుంటున్నారు. ఇటీవల యువతి కుటుంబసభ్యులు పెళ్లి ప్రతిపాదన చేశారు. తాను ఇప్పుడే చేసుకోనని ప్రశాంతి చెప్పింది. ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
ఈ క్రమంలోనే మంగళవారం బ్యూటీపార్లర్ కు వచ్చిన చక్రవర్తి ప్రశాంతితో వాగ్వాదానికి దిగాడు. తలుపులు మూసుకుని ఇద్దరు గొడవ పడ్డారు. ఆ సమయంలో కోపంలో ప్రశాంతి గొంతు నులిమి చక్రవర్తి హత్య చేశాడు. తర్వాత బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈలోపు యువతి తల్లి ఇందిర వచ్చి బ్యూటీ పార్లర్ తలుపు తీయగా వారిద్దరూ అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాస మూర్తి, సీఐ నరసింహ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొనప్రాయంతో ఉన్న చక్రవర్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.