»Tata Ipl 2023 Mumbai To 14 Run Win Over Sunrisers Hyderabad
IPL 2023 పోరాడి ఓడిన Hyderabad.. ముంబై హ్యాట్రిక్ విజయం
రైజర్స్ ను ముంబై కట్టడి చేసింది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి హైదరాబాద్ ను బోల్తా కొట్టించారు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబై హ్యాట్రిక్ విజయం సాధించగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవిచూసింది.
అద్భుత బౌలింగ్ (Bowling)తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.. భారీ స్కోర్ (Score) కాకుండా నియంత్రించారు. కానీ ఛేదనలో తడబడ్డారు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. దూకుడైన బ్యాటింగ్.. బౌలింగ్ లోనూ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ గడ్డపై జరిగిన మ్యాచ్ లో ముంబై 14 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, బెరెన్ డార్ఫ్ సత్తా చాటారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (Rajiv Gandhi International Cricket Stadium -Uppal) మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ముంబై బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. గ్రీన్ (40 బంతుల్లో 64: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) (Cameron Green) అర్థ శతకం బాదగా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (17 బంతుల్లో 37: 2 ఫోర్లు, 4 సిక్సర్లు) (Tilak Varma) సొంతగడ్డపై బ్యాట్ తో సత్తా చాటాడు. ఇక ఛేదనకు దిగిన సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు చేసి కుప్పకూలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48: 4 ఫోర్లు, ఒక సిక్స్) (Mayank Agarwal) అతి కష్టంగా పరుగులు రాబట్టగా.. క్లాసెన్ (16 బంతుల్లో 36: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు.
హోరాహోరీ
ముంబై భారీ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేయగా.. హైదరాబాద్ బౌలర్లు పరుగులను నియంత్రించేందుకు కష్టపడ్డారు. ఫలితంగా ముంబైని 200 పరుగుల దాటకుండా నియంత్రించారు. గ్రీన్ (64 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా.. ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38: 3 ఫోర్లు, 2 సిక్సర్లు) (Ishan Kishan) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (18 బంతుల్లో 28) (Rohit Sharma) జోరుగా ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ (7) మరోసారి నిరాశపర్చగా.. తిలక్ వర్మ (37) భారీగానే పరుగులు జోడించగా.. టిమ్ డేవిడ్ (16 నాటౌట్) పర్వాలేదనిపించాడు. స్కోర్ బోర్డును నియంత్రించినా సన్ రైజర్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నటరాజన్ ఒక వికెట్ తీసి 50 పరుగులు ఇవ్వగా.. 2 వికెట్లు పడగొట్టిన మార్కో జాన్సెన్ (43) స్కోర్ కూడా భారీగానే ఇచ్చాడు. భువనేశ్వర్ 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
ఆఖరి పోరాటం
ఛేదనకు దిగిన సన్ రైజర్స్ గట్టిగానే పోరాడింది. మయాంక్ అగర్వాల్ (48) పోరాటానికి ఇతర బ్యాటర్లు తోడు నిలవలేదు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ (9) స్వల్ప స్కోర్ కు వెనుదిరగగా.. రాహుల్ త్రిపాఠి (7), అభిషేక్ శర్మ (1) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. అనంతరం టపటపా వికెట్లు పడడం మొదలైంది. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36) చక్కటి బ్యాటింగ్ తో విజయ అవకాశాలను సజీవం చేశాడు. అబ్దుల్ సమద్ (9) బ్యాట్ కదపడంలో ఇబ్బంది పడ్డాడు. బౌలర్లు మార్కో జాన్సెన్ (13), వాషింగ్టన్ సుందర్ (10) కొంత పరుగులు రాబట్టారు. భువనేశ్వర్ (2) ఆఖరి వికెట్ కాగా.. బరిలో మయాంక్ మర్కడే ఉన్నాడు. రైజర్స్ ను ముంబై కట్టడి చేసింది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి హైదరాబాద్ ను బోల్తా కొట్టించారు. జేసన్ బెరెండాఫ్, రిలే మెరెడిత్, పియూష్ చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, అర్జున్ టెండూల్కర్ చెరో వికెట్ తీశారు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబై హ్యాట్రిక్ విజయం సాధించగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవిచూసింది.