»Telangana Bjp Team Failed To Attracts Ponguleti And Jupally
నాయకుల చేరికలపై BJP ఫెయిల్.. Amit Shah టూర్ పై ఆందోళన
రాష్ట్ర నాయకత్వం తీరుతోనే కొన్ని నెలలుగా తెలంగాణకు రావాల్సిన అమిత్ షా గైర్హాజరవుతున్నారు. ఆకస్మికంగా పర్యటనలు రద్దు చేసుకోవడానికి కారణం ఇదేనని తెలుస్తున్నది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పినప్పుడు ఇలాగేనా వ్యవహరించేదని పార్టీ అధిష్టానం అక్షింతలు వేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అధికార పార్టీ మేమే ప్రత్యామ్నాయం.. వచ్చేది మా ప్రభుత్వమే.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. ఎన్నికలే రావడం ఆలస్యం మేం అధికారంలోకి వచ్చేస్తాం.. ఇలాంటి పగటి కలలు తెలంగాణ (Telangana) బీజేపీ కంటోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేదు.. బలమైన నాయకులు పార్టీలోకి రావడంతోనే కొంత బలంగా కనిపిస్తోంది. ఇది చాలా ఎన్నికల్లో నిరూపించింది. బీజేపీకి అలవాటే కదా బలం లేని చోట.. బలమైన వారిని తమ వైపునకు తిప్పుకోవడం. అదే ప్రక్రియ తెలంగాణలో సాగిస్తోంది. అయితే తాజాగా ఆ వ్యూహం విఫలమైంది. ప్రస్తుతం పార్టీలో చేరేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. తాజాగా బీఆర్ఎస్ బహిష్కరించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) కాంగ్రెస్ లాగేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తనయుడు కూడా హస్తం పార్టీలోకి వెళ్తుండడంతో బీజేపీ చూస్తూ ఉండిపోయింది. ఈ క్రమంలో అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటనపై నీలిమేఘాలు అలుముకున్నాయి.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పార్టీ చేరికల కమిటీ ఒకటి బీజేపీ నియమించింది. ఆ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ (Eatala Rajender)ను నియమించారు. ఇతర పార్టీల నాయకులను చేర్పించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మినహా ఆ పార్టీలో చేరిన కీలక నాయకులు ఎవరూ లేరు. దీంతో ఈటల వ్యవహారం పార్టీలో చిచ్చు రేపింది. ఈ సమయంలో బీఆర్ఎస్ పొంగులేటి, జూపల్లిని బహిష్కరించింది. ఈ ఇద్దరు నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. వారిపై వేటు వేసిన రోజు ఈటల బృందం రంగంలోకి దిగాల్సి ఉంది. వారిని పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు ఏవీ జరగలేదు. ఆ నాయకులతో సంప్రదింపులు జరిగినట్టు కనిపించ లేదు. కానీ ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు పంపారు. కానీ దీన్ని కాషాయ పార్టీ సద్వినియోగం చేసుకోలేదు.
ఈ నిర్లక్ష్యం ఫలితంగా కాంగ్రెస్ (Congress) వారిద్దరినీ ఎగురేసుకుపోయింది. పొంగులేటి, జూపల్లి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు నాయకులతో మంతనాలు జరిపి.. వారికి కావాల్సిన హామీలన్ని ఇచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించింది. జాతీయ స్థాయిలో నుంచే వారికి గాలం వేశారు. వారు గతంలో అదే పార్టీకి చెందిన వారు.. కావడం ఢిల్లీ నుంచి హామీలు రావడంతో జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
వీరిద్దరి విషయంలో కాంగ్రెస్ వ్యవహరించినంత వేగంగా బీజేపీ స్పందించలేదు. పార్టీ చేరికల కమిటీ.. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వారిద్దరి వ్యవహారంలో పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా లేవు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తనయుడు కూడా హస్తం పార్టీలో చేరనున్నాడు. అతడిని కూడా ఆకర్షించుకోవడంలో కమలం విఫలమైంది. కొన్నాళ్లుగా పార్టీ చేరికల కమిటీ ఉత్సాహంగా లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. అందులో భాగంగానే చేరికలపై పెద్దగా దృష్టి సారించడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈనెల 23న చేవెళ్లలో (Chevella) జరిగే ‘విజయ సంకల్ప సభ’లో భారీ చేరికలు ఉంటాయని అందరూ భావించారు. తీరా నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతుండడంతో అమిత్ షా పర్యటన పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు. కేవలం బహిరంగ సభకే ఈ కార్యక్రమం పరిమితం కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన బీజేపీలో కలవరం రేపుతోంది. పార్టీ అధిష్టానానికి చేరికల విషయంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నివేదిక ఇస్తుందో వేచి చూడాలి. కాగా రాష్ట్ర నాయకత్వం తీరుతోనే కొన్ని నెలలుగా తెలంగాణకు రావాల్సిన అమిత్ షా గైర్హాజరవుతున్నారు. ఆకస్మికంగా పర్యటనలు రద్దు చేసుకోవడానికి కారణం ఇదేనని తెలుస్తున్నది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పినప్పుడు ఇలాగేనా వ్యవహరించేదని పార్టీ అధిష్టానం అక్షింతలు వేసే అవకాశం ఉంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు చక్కదిద్దుకుని ఎన్నికలకు సమాయత్తం చేయాలని పార్టీ నాయకత్వం సూచించే అవకాశం ఉంది.