»Cm Chandrababu Meets Union Minister Amit Shah In Delhi
Chandrababu : కేంద్ర బడ్జెట్ నిధుల కోసం అమిత్‌షాను కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ప్రత్యేక సాయం అడిగారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Chandrababu Meets Amit Shah : ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలంతా మెచ్చేలా కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం(AP CM) మంగళవారం రాత్రి కలుసుకున్నారు. విభజన చట్టంలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆయనను కోరారు. భేటీ తర్వాత… రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని ఎక్స్ వేదికగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ట్వీట్ చేశారు.
భేటీ కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా(Amit Shah) నివాసానికి మంగళవారం రాత్రి వెళ్లారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంటలకు పైగా ఏపీ పరిస్థితులపై చర్చించారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీ అవసరాలకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రద్ధతో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఏపీ సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు ధ్వంసం అయి ఉన్న విషయాన్ని కూడా ఆయన భేటీలో ప్రస్తావించారు. వీటిని బాగు చేసుకునేందుకు కూడా చేయూతనివ్వాలని అన్నారు. కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాల మంజూరు తదితర విషయాలపైనా చంద్రబాబు అమిత్‌షాతో(Amit Shah) చర్చలు జరిపారు. ఉపాధి అవకాశాల కల్పన, ఉద్యోగా అవకాశాల్లాంటివి రావాలంటే పరిశ్రమలకు సైతం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నిధులు మంజూరు చేయాలని కోరారు.