»Brief Exchanges Of Fire Between Security Forces Terrorists In Jammu Kashmirs Doda Today
gun Fire : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఫైరింగ్
జమ్ము కశ్మీర్లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Jammu Kashmir : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ని భద్రతాదళాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10:45 గంటలకు, ఈ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఒకసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు(Firing) చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలో రాత్రి జరిగిన కాల్పులు కలాన్ భాటా ప్రాంతంలో జరిగాయి. తెల్లవారు జామున జరిగిన కాల్పులు పంచాన్ భాటా ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రెండు సార్లు కాల్పులు జరగడం గమనార్హం.
జమ్ము కశ్మీర్(Jammu Kashmir)లోని దేసా అటవీ ప్రాంతంలో ఇప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ని (operation) భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. ఈ తాజా కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టమూ వాటిల్లలేదని తెలుస్తోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన ఉగ్రవాదులతో పాటు మిగిలిన వారినీ పట్టుకోవడానికి సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సెర్చ్ ఆపరేషన్లో ఉన్నాయి.
అయితే అక్కడి వాతావరణం, కొండలు, దట్టమైన అడవుల్లాంటివి ఆపరేషన్ను ఆలస్యం చేస్తున్నాయి. అంతటి కఠినమైన పరిస్థితుల్లో సైన్యం ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం, అంతకు ముందు జరిగిన కాల్పులను ద కశ్మీర్ టైగర్స్ ఉగ్ర సంస్థ చేసినట్లు ప్రకటించింది. ఈ సంస్థ పాక్ కేంద్రంగా పని చేసే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు షాడో సంస్థగా పని చేస్తోంది.