ENCOUNTER : జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని దోడాలో భారత సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర రక్షణ మంత్రి(DEFENCE MINISTER) రాజ్‌నాథ్ సింగ్(RAJNATH SINGH) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఆర్మీ అధికారులకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛను వినియోగించుకోవచ్చని చెప్పారు.
దోడాలో ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను రాజ్‌నాథ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు జరుగుతున్న ఆపరేషన్ స్థితిగతులను గురించి ప్రశ్నించారు. సోమవారం రాత్రి మొదలైన ఆపరేషన్ మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. గత రాత్రి 9 గంటల సమయంలోనే ఎన్కౌంటర్ మొదలైంది. ఉగ్రవాదులు అదను చూసి దొంగ దెబ్బ తీయడంతో నలుగురు జవానులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
జమ్ము, కశ్మీర్లో ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇలా వరుసగా జరిగిన రెండో అతి పెద్ద దాడి. గత వారం సైతం ఇలాగే కథువాలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పుడు కూడా ఐదుగురు సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడం ఇది రెండోసారి. దీంతో రాజ్‌నాథ్ సింగ్(RAJNATH SINGH) ఈ విషయంలో స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రమూకలను ఏరివేసేందుకు సైనికులు జల్లెడ పడుతున్నారు.