కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో సైనికులు ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. ప్రతిగా ఉగ్రవాదులపై ఏకంగా 5000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Kathua Attack : కథువా ఉగ్రదాడి.. సైనిక వాహనంపై వరుసగా తుపాకులు పేలుతున్నాయి. గ్రనేడ్లు వచ్చి పడుతున్నాయి. వాటి తాకిడికి ఆ వాహనంలో ఉన్న సైనికులు వరుసగా సొమ్మసిల్లుతున్నారు. ప్రాణాలు పోతున్నాయో తెలీదు. ఉంటున్నాయో తెలీదు. అలాంటి సమయంలో మన సైనికలు ఎంతో ధైర్య సాహసాలు కనబరిచారు. మరింత ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అనుకున్నారు. గాయాల పాలైన సైనికులనూ కాపాడుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో వారి మెదళ్లలో అదొక్కటే కదలాడింది. అందుకే ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా షూట్ చేయడం ప్రారంభించారు. ఓ సైనికుడికి చేతికి తీవ్రంగా గాయం అయింది. అయినా సరే పోరాటంలో ఏ మాత్రం డీలా పడలేదు. ఒంటి చేత్తో కాల్పులు చేపట్టాడు. ఇలా వారు ఎదుటి వారిని గుక్క తిప్పుకోనీయకుండా చేశారు. అదనపు బలగాలు వచ్చే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వరుసగా ఏకంగా 5000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. దీంతో ఇక చేసేది లేక టెర్రరిస్టులు( terrorists) తోక ముడిచారు. సమీప అడవుల్లోకి పారిపోయారు.
జమ్ము కశ్మీర్‌లోని(Jammu Kashmir) కథువాలో మూడు రోజుల క్రితం ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. పెట్రోలింగ్‌లో ఉన్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో సైనిక వాహనంలో ఉన్న సైనికులు సైతం వారికి దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ఎదురు కాల్పుల సమయంలో ఏకంగా 5,189 రౌండ్ల కాల్పులు జరిపారని సంబంధిత అధికారులు వెల్లడించారు. దాడి జరిగిన తీరును ఉన్నతాధికారులు సమీక్షించారు. అక్కడ రక్తంతో తడిసిన హెల్మెట్లు, తుపాకీ దెబ్బలకు పగిలిన టైర్లు, రక్షణ కవచాలను దగ్గరుండి చూశారు. వాటిని చూస్తేనే ఘటన తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోందని వారు అన్నారు. ఈ కథువా ఉగ్ర దాడిలో (Kathua Attack) ఐదుగురు సైనికుకలు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వీరంతా భారత సైన్యంలోని 22 గడ్వాల్ రెజిమెంట్‌కు చెందిన వారు.