Student Visa Fee : మన దేశం నుంచి ఏటా పెద్ద ఎత్తున స్టూడెంట్లు విదేశాల్లో చదువుల కోసం వెళుతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ తదితర దేశాలకు స్టూడెంట్లు వెళుతుంటారు. ఏటా ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ని ఆసరాగా చేసుకుని ఆస్ట్రేలియా(Australia), యూకేలు(UK) భారీగా విదేశీ స్టూడెంట్ వీసా పీజుల్ని పెంచేశాయి.
ఎవరైనా ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలంటే వీసా ఫీజు గతంలో 710 డాలర్లు ఉండేది. ఇప్పుడు దాన్ని రెట్టింపు కంటే అధికంగా పెంచేసిందా దేశం. ఏకంగా 1600 డాలర్లు చేసేసింది. యూకే సైతం గత ఫిబ్రవరిలో స్టూడెంట్ వీసా ఫీజుల్ని(Student Visa Fee) భారీగా పెంచేసింది. గతంలో 624 పౌండ్లుగా ఉన్న ఫీజు పెంపు తర్వాత 1,035 పౌండ్లకు చేరుకుంది. అంటే ఇప్పుడు కాస్ట్లీ వీసా ఫీజు ఆస్ట్రేలియాదే అయ్యింది. ఆ తర్వాతి స్థానంలో యూకే ఉంది.
మన దేశం నుంచి చదువుకునే విద్యార్థులు ఎక్కువగా మొదట అమెరికా వెళుతుంటారు. ఆ తర్వాత బ్రిటన్‌కు వెళ్లేవారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియానూ(Australia) అధికంగా ఎంచుకుంటున్నారు. ఈ దేశం ఏటా 2.6లక్షల స్టూడెంట్ వీసాలను జారీ చేస్తోంది. ఇప్పుడు ఎక్కువ వీసా ఫీజు(Visa Fee) వసూలు చేస్తున్న దేశంగానూ నిలిచింది. ఇదిలా ఉండగా అమెరికా స్టూడెంట్ వీసా ఛార్జీ కేవలం 185 డాలర్లు మాత్రమే. అలాగే కెనడా వీసా ఛార్జీ అయితే 150 డాలర్లుగా ఉంది.