»Wikileaks Founder Julian Assange Returns To Australia After Us Legal Battle Ends
WikiLeaks : పద్నాలుగేళ్ల తర్వాత వికీలీక్స్ అసాంజేకు విముక్తి.. ఆస్ట్రేలియాకు పయనం
అమెరికాతో న్యాయ పోరాటంలో 14 ఏళ్లగా సమస్యల్ని ఎదుర్కొంటున్న వికీలీక్స్ అసాంజే ఎట్టకేలకు ఈ జంఝాటాల నుంచి విముక్తి పొందారు. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం అయ్యారు.
WikiLeaks founder Julian Assange : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే(Julian Assange) ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడ్డారు. అమెరికా రక్షణ సమాచారాన్ని గూఢచర్య చట్టాలకు విరుద్ధంగా వ్యాప్తి చేశారని అమెరికా ఆయనపై న్యాయ పోరాటానికి దిగింది. 2010లో ప్రారంభమైన ఈ కేసు ఇప్పటి వరకు పలు మలుపులు తిరిగి చివరికి సమాప్తం అయ్యింది. నేరాన్ని అంగీకరించేందుకు అసాంజే సిద్ధం కావడంతో కోర్టు ఆయన వాంగ్మూలాన్ని వింది.
కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు అసాంజే అమెరికాలో కాలు మోపడానికి అంగీకరించలేదు. దీంతో ఆస్ట్రేలియా(Australia) దగ్గరలో అమెరికా అధీనంలో ఉన్న మారియానా ద్వీపంలోని కోర్టుకి అసాంజే బుధవారం హాజరయ్యారు. భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా తాను రహస్య పత్రాలను బయట పెట్టానని ఆయన తెలిపారు. అయితే అది గూఢచర్య చట్టానికి విరుద్ధమేనని కోర్టు ముందు ఒప్పుకున్నారు. బ్రిటన్లో నిర్బంధంలో అసాంజే గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ వి.మంగ్లోనా తెలిపారు. ఆయన విడుదలను ధృవీకరిస్తూ తీర్పిచ్చారు. దీంతో ప్రత్యేక విమానం ద్వారా అసాంజే సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.
నేరాంగీకారానికి ఒప్పుకోవడంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు అనూహ్యంగా ముగిసింది. దీంతో 52 ఏళ్ల అసాంజేకు విముక్తి లభించింది. బ్రిటన్లో ఐదేళ్లపాటు జైల్లో గడిపిన అసాంజే ఎట్టకేలకు సొంత దేశానికి చేరుకున్నారు. ఆయన భార్య కూడా బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా(Australia) చేరుకునేంత వరకు ఆయన పక్కనే ఉన్నారు. కాన్బెర్రా విమానాశ్రయంలో తండ్రి జాన్ షిప్టన్ అసాంజేకు( Assange) స్వాగతం పలికారు.