»Open Loop Ticketing System Will Come In Hyd Metro
HYD METRO : రైలెక్కి దిగాక టికెట్ కొనుక్కోవచ్చు.. మెట్రోలో కొత్త టికెటింగ్ సిస్టం
హైదరాబాద్ మెట్రో ఓ కొత్త రైల్వే టికెటింగ్ సిస్టంని తీసుకొస్తోంది. దాని ద్వారా మెట్రో రైలులో ముందు టికెట్ లేకుండానే ప్రయాణించొచ్చు. దిగాక మాత్రం టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Hyderabad Metro New ticketing System : మనం రైలెక్కాలంటే ముందు టికెట్ కొనుక్కోవాలి. ఆన్లైన్లోనో లేదా టికెట్ కౌంటర్‌లోనో టికెట్‌ని కొనుక్కుని అప్పుడు రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో కొత్త సిస్టంని తీసుకొస్తోంది. ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టం(OPEN LOOP TICKETING SYSTEM) ద్వారా ఇప్పుడు మనం రైలు ఎక్కి దిగిపోయాక కూడా టికెట్ కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణికుడు తన వద్ద ఉన్న కార్డును మొదట రైలు ఎక్కేడప్పుడు ఉన్న యంత్రం దగ్గర చూపించాలి. దిగేప్పుడూ చూపించాలి. ఎంత దూరం ప్రయాణం చేశారన్నదాని ఆధారంగా డబ్బులు చివర్లో కట్ అవుతాయి. హైదరాబాద్ మెట్రోలో(HYDERABAD METRO) టికెట్లు కొనుక్కునే వారు ఇప్పటి వరకు రకరకాల పద్ధతుల్లో వాటిని కొనుక్కుంటున్నారు. టికెట్ కౌంటర్లో, మొబైల్ ఫోన్ ద్వారా, వెండింగ్ మిషన్ల ద్వారా, స్మార్ట్ కార్డ్స్ ద్వారా పలు రకాలుగా వీటిని కొనుక్కుంటున్నారు. అయితే ఎలా టికెట్ తీసుకున్నా రైలు ఎక్కే ముందే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న కొత్త విధానం ద్వారా రైలు దిగాక డబ్బులు కట్ అయ్యే సౌలభ్యం వస్తోంది. ఈ లూప్ టికెటింగ్(OPEN LOOP TICKETING SYSTEM) విధానం ద్వారా ఒకే కార్డుతో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌ల్లో ప్రయాణించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు రవాణా వ్యవస్థల్లో ఇలాంటి సౌకర్యాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భారత్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోలో(HYD METRO) 2025 ఆర్థిక సంవత్సరంలోనే ఈ కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ ఆర్థిక నివేదికలో తెలిపింది.