హైదరాబాద్‌లో మెట్రో రైల్ (Metro Rail) విస్తరణపై ప్రభుత్వం ముందు అడుగు వేసింది. ఈ మేరకు మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై సీఎస్, మెట్రో రైల్ భవన్లో పలువురు అధికారులతో మంత్రి కేటీఆర్ (Minister KTR) సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో డిపోకు 48 ఎకరాల భూమిని అప్పగించాలని ఆదేశించారు.హైదరాబాద్ (Hyderabad) భవిష్యత్తుకు భారీగా మెట్రో విస్తరణ చేయాలన్నారు. మెట్రో విస్తరణతోనే రద్దీ, కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రజా రవాణా బలోపేతంతోనే విశ్వనగరాలు తయారవుతాయని.. భాగ్యనగరం కూడా అలా మారాలని మంత్రి ఆకాంక్షించారు.మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ పైన దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్‌లను ప్రారంభిస్తే మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. తాజాగా మెట్రో లైన్(Metro line)ని భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాల్లో వెంటనే అవసరమైన సర్వే చేపట్టి ప్రాథమిక రిపోర్టులను, తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. మెట్రో విస్తరణ కోసం అవసరమైన నిధుల సేకరణకు ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ఆర్థిక, పురపాలక శాఖ అధికారులకు కేటీఆర్ సూచించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్(Parking) కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయన ఆదేశించారు.