»Julian Assange Free A Look At The Timeline Of The 14 Year Long Wikileaks Espionage Case
Wikileaks : ఏళ్ల తర్వాత కొలిక్కి వస్తోన్న వికీలీక్స్ కేసు.. జైలు నుంచి అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే జైలు నుంచి విడుదలయ్యారు. సైనిక రహస్య పత్రాల విడుదల కేసులో జైల్లో ఉన్న ఆయన నేరాంగీకారానికి ఒప్పుకున్నారు. దీంతో సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది.
Julian Assange : దాదాపుగా 14 ఏళ్లుగా కొనసాగుతున్న వికీలీక్స్ కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసంజే(Julian Assange) నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధం కావడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టులో హాజరు కావడానికి వీలుగా ఆయనను లండన్ కోర్టు నుంచి విడుదల చేశారు. మంగళవారం ఆయన విడుదల జరిగింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు చివరి అంకానికి చేరుకుందని తెలుస్తోంది.
తమ గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అసాంజే పలు విషయాలను బయటకు వెల్లడించారని అమెరికా అప్పట్లో న్యాయ పోరాటానికి దిగింది. అసాంజే జర్నలిస్టే అయినప్పటికీ సైన్యానికి సంబంధించిన పత్రాలు, సమాచారాన్ని బయటకు వెల్లడించడం సరికాదని తెలిపింది. ఈ విషయంలో మరో వర్గం ఆయనకు మద్దతుగానూ నిలిచింది. సైన్యంలో లోపాలను ఎత్తి చూపడం సరైనదేనంటూ ఆయనకు వత్తాసు పలికింది. అయితే అమెరికా మాత్రం సమాచారాన్ని లీక్ చేయడం ద్వారా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు ప్రమాదంలో ఉన్నాయని అభిప్రాయపడింది.
ఇప్పుడు నేరాన్ని అంగీకరించేందుకు అసాంజే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు విచారణ ఇప్పుడు జరుగుతోంది. ఆయన అమెరికాలోకి అడుగుపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఆస్ట్రేలియా దగ్గరలోని మరియానా ఐలాండ్స్‌లోని కోర్టులో స్థానిక కాలమాననం ప్రకారం బుధవారం ఆయన కోర్టుకు హాజరవుతారు. ఈ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్నప్పటికీ అమెరికా ఆధీనంలో ఉన్న ద్వీపాలు. దీంతో అక్కడి కోర్టులో అసాంజే నేరాన్ని అంగీకరిస్తారు. అదనపు జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించమని కోరతారు. 2006లో వికీలీక్స్(Wikileaks) ప్రారంభం అయ్యింది. 2010లో అమెరికా సైనిక పత్రాలను భారీగా విడుదల చేసింది. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధాలను వివరించే 91000, 400000 రహస్య ఫైళ్లను బయటకు విడుదల చేసింది. అప్పటి నుంచీ అసాంజే చిక్కుల్లో పడ్డారు. బ్రిటన్‌లో 2019 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు.