టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదౌతున్నాయి. పటిష్టమైన జట్లు చతికిల పడుతున్నాయి. పసికూనలుగా ముద్ర పడ్డ జట్లు చెలరేగి ఆడుతున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసుకుంది.
T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదౌతున్నాయి. పటిష్టమైన జట్లు చతికిల పడుతున్నాయి. పసికూనలుగా ముద్ర పడ్డ జట్లు చెలరేగి ఆడుతున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్ సూపర్-8లో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 21పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 60 పరుగులు చేయగా.. ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేశాడు.
ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరింది. మార్కస్ స్టోయినిస్ వీరి భాగస్వామ్యానికి తెరవేశాడు. గుర్బాజ్‌ను 60 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ కూడా ఔటయ్యాడు. ఆడమ్ జంపాకు దొరికిపోయాడు.ఆ సమయంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ వీరవిహారం చేశాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి.. ఆప్ఘన్ జోరుకు బ్రేక్ వేశాడు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 148 పరుగుల వద్దే ఆగిపోయింది. ఆసీస్ జట్టుకు 149 పరుగుల టార్గెట్ విధించింది.
149 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్ జట్టుకు ఆరంభంలో షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. నవీనుల్‌హక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మూడో ఓవర్లో మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. మార్ష్ వికెట్‌ను కూడా నవీన్ ఉల్హక్ దక్కించుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా కీలకమైన ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. 3 పరుగుల వద్ద మహ్మద్ నబీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనుకబడిపోయింది. ఒక్క గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే ఆఫ్ఘన్ బౌలర్ల ధాటిని తట్టుకుని 59 పరుగులు చేశాడు. మాక్స్ వెల్ రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ మాక్స్వెల్ వికెట్ తీయడంతో ఆసీస్ కోలుకేలేకపోయింది. గుల్బాదిన్ అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుల్బాదిన్‌తో పాటు నవీనుల్ హక్ , మహ్మద్ నబీ , రషీద్ ఖాన్ , ఒమర్జాయ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు కోలుకోలేకపోయింది. దీంతో గ్రూప్-1లో భారత్ రెండు విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్గాన్ ఒక్కో గెలుపుతో రేసులో ఉన్నాయి.