వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. వారంతా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకడు కార్ల్ హూపర్. బ్యాటింగ్ చేయడంలోనూ, బౌలింగ్ చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇటీవలే హూపర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. హూపర్ ఆట ముందు తానెందుకూ పనికి రానని తేల్చి చెప్పాడు. నిజంగా హూపర్ అంత మొనగాడా? ఆ విండీస్ ప్లేయర్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? తెలుసుకుందాం.
Carl Hooper: అత్యుత్తమ ఆటగాళ్లలో కార్ల్ హూపర్ ఒకరని బ్రియాన్ లారా వెల్లడించాడు. సచిన్ తెందూల్కర్తోపాటు తాను కూడా క్లార్కు ఉన్న టాలెంట్‌కు దరిదాపుల్లో లేమని చెప్పాడు. కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్ అయ్యేవరకు అతడి గణాంకాలు చాలా భిన్నంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు. కెప్టెన్‌గా దాదాపు 50 సగటుతో ఆడిన విషయాన్ని లారా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. హూపర్ తన సామర్థ్యాలను ఆటగాడిగా కాకుండా కెప్టెన్‌గా మాత్రమే వినియోగించుకోవడం బాధాకరమని లారా ఆవేదన వ్యక్తం చేశాడు. దిగ్గజ వెస్టిండీస్ బ్యాటర్ వీవీయన్ రిచర్డ్స్కు హూపర్‌పై ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఈ సందర్భంగా లారా గుర్తుచేసుకున్నాడు. వివ్ రిచర్డ్స్ ఎప్పుడూ ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయపడలేదని.. అతడి గొప్పదనం ఎప్పటికీ తగ్గదని లారా ప్రశంసలు కురిపించాడు. ఇతరులు తనకంటే బాగా ఆడకూడదని రిచర్డ్స్ ఎప్పుడూ కోరుకోలేదని..తన కంటే క్లార్ హూపర్నే రిచర్డ్స్ ఎక్కువగా ఇష్టపడతాడని బ్రియాన్ లారా వివరించాడు.
క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ అందని రికార్డులను విండీస్ దిగ్గజం కార్ల్ హూపర్ అందుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచిన హూపర్ … 5 వేల పరుగులు చేసి, 100 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ వంద క్యాచులు, వంద వికెట్లు తీసిన ఘనత కూడా హూపర్ పేరిటే ఉండడం విశేషం. 1999 వరల్డ్ కప్ అనంతరం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రెస్టు తీసుకుంటున్న హూపర్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మళ్లీ ఆహ్వానించింది. ఈ సారి ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా అవకాశం వచ్చిన తర్వాత హూపర్ చెలరేగి ఆడాడు. కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తూనే … ఆటగాడిగా కూడా రాటు దేలాడు. అంతకు ముందు అందుకోలేని రికార్డులను ఎన్నో సొంతం చేసుకున్నాడు. 2002 లో టెస్టులకు గుడ్ బై చెప్పిన హూపర్, 2003లో వన్డేలకు కూడా బాయ్ బాయ్ చెప్పాడు.
హూపర్ క్రికెట్ కెరీర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే… 1987లో విండీస్ జట్టులోకి వచ్చిన హూపర్ రెండో మ్యాచ్‌లోనే తన సత్తా చాటాడు. భారత జట్టుతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. మొత్తం 102 టెస్టులు ఆడిన హూపర్ ఏడు సెంచరీలు చేశాడు. ఒక డబుల్ సెంచరీ కూడా సాధించాడు. మొత్తంగా 5762 పరుగులు చేశాడు. భారత జట్టుపై జరిగిన మ్యాచ్ 223 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ల పరంగా చూస్తే 102 మ్యాచుల్లో 114 వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డే కెరీర్‌ను చూస్తే.. 227 వన్డేల్లో 5661 పరుగులు చేశాడు. 7 సెంచరీలు 29 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తో పాటు షేర్ వార్న్, స్టీవ్ వా వంటి ఆసీస్ ప్లేయర్లు కూడా హూపర్‌ను అప్పట్లో ప్రశంసించేవారు.