ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బ్యాటర్లలో ఎంత మంది సెంచరీలు సాధించారు? వారిలో ఎవరైనా రెండు సెంచరీలు సాధించారా? మాస్టర్ బ్లాస్టర్ గతంలో ఎన్ని సెంచరీలు సాధించాడు? సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు సాధించాడు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ సాధించడంతో సెంచరీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టు అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గెలుపు సొంతం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి ముంబై జట్టుకు మరపురాని విజయం అందించారు. ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈక్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. గతంలో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ కూడా రెండు సెంచరీలు చేశాడు. వీరిద్దరితో పాటు ముంబై ఇండియన్స్ తరపున సెంచరీలు చేసిన వారు ఎవరనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వారి కోసం గూగుల్‌లో అన్వేషణ మొదలయింది.
ముంబై ఇండియన్స్ తరపున ఆడిన శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 2008లో తన ఫ్రాంచైజీ తరపున సెంచరీ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై తరపున తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2011లో సెంచరీ సాధించాడు. కొచ్చీ టస్కర్స్ కేరళ జట్టుపై సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2014లో మరో ముంబై ఇండియన్స్ ఆటగాడు లెండిల్ సిమ్మోన్స్ పంజాబ్ జట్టుపై సెంచరీ సాధించాడు. సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ముంబై ఇండియన్స్ ఆటగాడు కేమెరన్ గ్రీన్ కూడా సెంచరీ వీరుల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2023లో హైదరాబాద్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో చెలరేగి ఆడి శతకం నమోదు చేశాడు. సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.
2012లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై సెంచరీ సాధించాడు. 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ కేవలం 60 బంతుల్లోనే 12 ఫోర్లు 5 సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ 2024లో కూడా రోహిత్ శర్మ ఐపీఎల్లో సెంచరీ సాధించాడు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 63 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. ఏప్రిల్ 14వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాచ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు ఆ మ్యాచ్‌లో ఓటమి పాలయింది.
ఇక సూర్యకుమార్ యాదవ్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడి సెంచరీ సాధించాడు. 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 49 బంతుల్లోనే 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ గత ఏడాదిలో తొలి సెంచరీ సాధించాడు. ఈ ఏడాది మరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు 6 సిక్సర్లు బాదాడు. తిలక్ వర్మతో కలిసి 143 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ముంబై తరపున ఛేజింగ్ చేస్తూ సెంచరీ సాధించిన నాల్గవ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు సనత్ జయసూర్య, లెండిల్ సిమన్స్, కెమరున్ గ్రీన్‌లు ఛేజింగ్ చేస్తూ సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఆ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు.