భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఉత్కంఠ పోరులో పైచేయి సాధించి..సఫారీలను మట్టికరిపించింది. పైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాడినికి ఏ ఏ అంశాలు కలిసొచ్చాయి? చేజారుతోంది అనుకున్న మ్యాచ్ ఏవిధంగా పట్టుబిగిసిందో సమీక్షిద్దాం.
INDvsSA: సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన కలిసికట్టుగా రాణించింది. బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీలు అండగా నిలవగా… బౌలింగ్‌లో బుమ్రా, అర్షదీప్, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. వీరంతా జట్టును విజయపథంలో నడిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా జట్టు 169 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో భారత జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అక్షర్ పటేల్ చేసిన 47 పరుగులు, శివం దుబే చేసిన 27 పరుగులు భారత జట్టుకు మంచి స్కోర్ అందించాయి. టోర్నీ మొత్తం వైఫల్యం చెందుతూ వచ్చిన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించి 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ విభాగంలో వీరి ముగ్గురు రాణించగా.. బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్షదీప్, హార్ధిక్ పాండ్యాలు జట్టుకు వెన్నెముకవలే నిలిచారు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో వీరు చూపించిన ప్రతిభ .. భారత జట్టుకు విజయాన్ని అందించింది. వీరిలో హార్ధిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. భీకరఫామ్‌లో ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేయడం ద్వారా హార్ధిక్ పాండ్యా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అప్పటి వరకు సౌతాఫ్రికా జట్టువేపే విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
15వ ఓవర్లో క్లాసెన్ చెలరేగి ఆడి 24 పరుగులు పిండుకున్నాడు. 16 వ ఓవర్ బుమ్రా వేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17వ ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా తొలి బంతికే క్లాసెన్ వికెట్ పడగొట్టాడు. భీకరఫామ్‌లో ఉన్న క్లాసెన్ ఔటవ్వడంతో భారత శిబిరంలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ ఓవర్లో పాండ్యా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మార్కో జాన్సెన్ వికెట్ పడగొట్టాడు. 19వ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ కూడా చెలరేగి బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 19 ఓవర్లు పూర్తయ్యే సమయానికి సౌతాఫ్రికా జట్టు 161 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హార్ధిక్ పాండ్యా చివరి ఓవర్ వేశాడు. తొలి బంతికి డేవిడ్ మిల్లర్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి ఎగిరింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆ బంతిని ఎంతో నేర్పుగా పట్టుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఆ క్యాచ్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరిన తర్వాత … క్రీజులో కేశవ్ మహారాజ్, కగిసో రబడ ఉన్నారు. వారిద్దరూ కూడా భారీ షాట్లు కొట్టలేకపోయారు. చివరి ఓవర్ 5వ బంతికి కగిసో రబడ ఔటయ్యాడు. దీంతో సఫారీ జట్టుకు ఓటమి ఖాయమయింది. భారత జట్టు 7 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్ గెలిచింది.