»T20 World Cup Which Is Increasing Interest These Are The Super 8 Teams
T20 World Cup: ఆసక్తి పెంచుతున్న టీ20 వరల్డ్ కప్.. సూపర్ 8 టీమ్స్ ఇవే
టీ20 వరల్డ్ కప్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. పసికూనలుగా భావించిన జట్లు ఇరగదీశాయి. పటిష్టమైనవి భావించిన జట్లు ఇంటి బాట పట్టాయి. దీంతో సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు సూపర్ 8కి చేరుకుంది.
T20 World Cup which is increasing interest.. These are the Super 8 teams
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. పసికూనలుగా భావించిన జట్లు ఇరగదీశాయి. పటిష్టమైనవి భావించిన జట్లు ఇంటి బాట పట్టాయి. దీంతో సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు సూపర్ 8కి చేరుకుంది. సూపర్ 8 దశకు చేరిన చివరి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. నేపాల్‌పై విజయం సాధించడం ద్వారా గ్రూప్ 1లోని ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ జట్ల సరసన చేరింది. గ్రూప్ 2లో అమెరికాతో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు నిలిచాయి. మొదట ఐర్లాండ్ జట్టుపై భారీ విజయం సాధించిన భారత్… ఆ తర్వాత పాకిస్తాన్ జట్టును కూడా ఓడించింది. ఆరు పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లో అమెరికా జట్టును మట్టికరిపించిన రోహిత్ సేన సూపర్ 8 స్టేజ్‌కు చేరుకుంది. ఈ దశలో భారత్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది.
వరల్డ్ కప్ నిర్వహణకు ఉపయోగిస్తున్న పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆటగాళ్లందరూ అవస్థలు పడుతున్నారు. భారత జట్టులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా తదితరులు … ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి జట్టు విజయానికి తోడ్పడుతున్నారు. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. కీలకమైన సూపర్ 8 దశలోనైనా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆసీస్ జట్టు కూడా ఆడిన నాలుగు లీగ్ దశ మ్యాచుల్లో అదరగొట్టింది. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కస్ స్టోయినెస్, ఆడమ్ జంపా తదితరులు ఆ జట్టు విజయాల్లో కీలకంగా నిలిస్తున్నారు. ఆడమ్ జంపా ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు తొమ్మిది వికెట్లు పడగొట్టి … అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టాప్ పొజిషన్లో నిలిచాడు. రానున్న మ్యాచుల్లో కూడా ప్రత్యర్ధులకు తన బౌలింగ్‌తో బెంబేలెత్తించనున్నాడు. ఆసీస్ జట్టు తన తొలి సూపర్ 8 మ్యాచ్‌ను బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది.
ఇంగ్లండ్ జట్టు కూడా టోర్నీకి ముందు బలంగా కనిపించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అపశకునం ఎదురయింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఒమన్, నమీబియా జట్లను చిత్తుచేసి సూపర్ 8 దశకు చేరుకుంది. వెస్టిండీస్ జట్టుతో ఇంగ్లండ్ తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో అందరినీ ఆశ్చర్య పరిచిన జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఉగాండా జట్టును 125 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘన్ జట్టు…. ఆ తర్వాత కివీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించింది. కివీస్ జట్టును ముప్పతిప్పలు పెట్టింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజీలాండ్ జట్టు కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బౌలర్లు రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో కివీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.