»India Among Top 3 Countries In Forest Area Gains Fao Report
Forest Area: భారత్‌లో పెరిగిన అటవీ విస్తీర్ణం.. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
భారత్‌లో 2010 నుంచి 2020 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Forest Area: భారత్‌లో అటవీ భూమి భారీగా పెరిగింది. 2010 నుంచి 2020 వరకు ఉన్న కాలంలో మన దేశంలో దాదాపుగా 2.66 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) రిపోర్టులో వెల్లడయ్యింది. అటవీ నిర్మూలన చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టినట్లు ఆ రిపోర్టు చెబుతోంది. ఆ దశాబ్ద కాలంలో ప్రపంచంలో అటవీ విస్తీర్ణం పెరిగిన టాప్ 10 దేశాల్లో భారత్(
India) మూడో స్థానంలో నిలిచింది. అడవిని పెంచేందుకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. నిర్వీర్యం అవుతున్న నేలల్లో ప్రత్యేకమైన ఇనోవేటివ్ పద్ధతుల ద్వారా భారత్ ఇలా అడవుల విస్తీర్ణాన్ని పెంచగలిగిందని తెలిపింది.
అటవీ విస్తీర్ణం పెరిగిన టాప్ 10 దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలో 1,937,000 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దీంతో ఇది ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 4,46,000 హెక్టార్లు పెరగడంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానాన్ని భారత్ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో చిలీ, వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా దేశాలు వరుసగా ఉన్నాయి. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో సైతం 2023లో అటవీ నిర్మూలన(deforestation) 50 శాతం వరకు తగ్గినట్లు రిపోర్టు చెబుతోంది. అలాగే ఇండోనేషియాలో సైతం 2021, 2022 సంవత్సరాల్లో అటవీ నిర్మూలన 8.4శాతం వరకు తగ్గింది.