»Donald Trump Won Formal Nomination Monday As The Republican Presidential Candidate Picks Old Critic As Running Mate
us elections : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు..ఉపాధ్యక్షడిగా ఎవరంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
us elections 2024 : డొనాల్డ్ ట్రంప్ అందరూ అనుకుంటున్నట్లుగానే అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అభ్యర్థిత్వం షురూ అయ్యింది. ఈ మేరకు పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. సోమవారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సదస్సులో అంతా ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటించారు. పార్టీ నామినేషన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్‌కు అందజేశారు.
ట్రంప్ ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. నిక్కీహేలీ, వివేక్ రామస్వామి లాంటి వారు ఆయనకు పోటీ ఇవ్వలేకపోయారు. రామస్వామి మొదట్లోనే వెనక్కి తగ్గారు. నిక్కే హేలీ కూడా ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో ట్రంప్ గెలుస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్‌ని దక్కించుకున్నారు.
అధ్యక్ష అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన వెంటనే ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి పేరును సైతం ప్రకటించారు. ఒహయ్యో సెనేటర్ (Ohio Senator) జేడీ వాన్స్(J.D. Vance) పేరును ఆయన ప్రతిపాదించారు. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ సరైన వ్యక్తి అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు వాన్స్ ట్రంప్‌ను దారుణంగా విమర్శించేవారు. ఆ తర్వాతి క్రమంలో ఆయనకు విధేయుడిగా మారారు. విశ్వసనీయుడిగా పని చేశారు. అలాంటి వ్యక్తిని ట్రంప్ ఈ పదవికి ఎంచుకున్నారు. ఈ వాన్స్ సతీమణి తెలుగమ్మయే కావడం విశేషం. ఆయన సతీమణి ఉషా చిలుకూరి. ఆమె పుట్టింది కాలిఫోర్నియాలోనే అయినప్పటికీ, తల్లిదండ్రులది మాత్రం ఆంధ్రప్రదేశ్.