»Telangana Ys Sharmila Misunderstanding To Soyam Bapu Rao In Indravelli Tour Viral On Social Media
Indravelli వైఎస్ షర్మిల మరోసారి తప్పిదం.. ఎవరు ఏమిటో తెలుసుకోవా తల్లీ..
రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై అవగాహన తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. ‘మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరచిపోయావా?’ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తామంటే దొరికిపోతారు. ప్రజల ముందు నవ్వులపాలు అవ్వాల్సిందే. రాజకీయం (Politics) అంటే ఆషామాషీ కాదు. అపరిపక్వత లేని రాజకీయ నాయకులు ఉంటే ప్రజల ముందు పరువు పోగొట్టుకోవాల్సిందే. అలాంటి కోవలోకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) చేరుతారు. మొన్న సీపీఎం (CPI-M) కార్యాలయంలోకి వెళ్లి పరువు పోగొట్టుకున్న షర్మిల తాజాగా ఆదిలాబాద్ లో మరోసారి పరువు పోగొట్టుకుంది. ఒక పార్టీ ఎంపీ.. మరో పార్టీ ఎంపీగా భావించి తప్పులో కాలేసింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇంద్రవెల్లిలో (Indravelli) ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన ఆదివాసీ వీరులకు సలామ్.. ఇంద్రవెల్లి పోరుగడ్డకు సలామ్. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం. హక్కు పత్రాలు కూడా అందిస్తాం’ అని షర్మిల తెలిపారు. అనంతరం స్థానిక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో (Soyam Bapu Rao) షర్మిల మాట్లాడారు.
ఇక్కడే ఆమె పొరపడింది. ‘ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. బీఆర్ఎస్ (BRS Party) ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి’ అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఈ మాటలతో ఎంపీ అవాక్కయ్యాడు. తాను గెలిచింది బీజేపీ అయితే ఈమె ఏంటి బీఆర్ఎస్ ఎంపీని అంటోంది అని ఆలోచించి వెంటనే స్పందించారు. ‘అమ్మ నేను బీఆర్ఎస్ కు చెందిన ఎంపీని కాదు. నేను బీజేపీ ఎంపీని’ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తప్పును గ్రహించిన షర్మిల వెంటనే ‘క్షమించండి.. నేను బీఆర్ఎస్ ఎంపీగా భావించా’ అని పొరపాటు దిద్దుకుంది. ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది.
ఎవరు ఏమిటో తెలుసుకోవమ్మ షర్మిల? అని నెటిజన్లు (Netizens) కామెంట్లు చేస్తున్నారు. ‘రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై అవగాహన తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి’ అని సూచిస్తున్నారు. ‘మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరచిపోయావా?’ అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ముందు వెళ్లి రాజకీయాలు నేర్చుకో.. ఆ తర్వాత ప్రజల మధ్యకు రా తల్లీ’ అని చెబుతున్నారు. ‘అందుకే చెప్పేది. నువ్వు తెలంగాణ నాయకురాలివి కావు. నీకు తెలంగాణ రాజకీయాలు తెలియవు. ఇక్కడి నాయకులు తెలియదు. వెళ్లు ఏపీకి’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.