YSR Birthday : జగన్కు షాకిచ్చిన షర్మిల.. కలిసి నివాళులు అర్పించేందుకు నో
సోమవారం వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలలు కలిసి తండ్రికి నివాళులు అర్పిస్తారని తొలుత భావించారు. అయితే అందుకు షర్మిల నో చెప్పారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
YSR Birthday : వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిలల మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు తండ్రి జయంతి రోజు కుటుంబ సమేతంగా కలిసి నివాళులు అర్పించేలా ప్లాన్ చేశారు. ఈ విషయమై జగన్, షర్మిల కుటుంబాల మధ్య మంతనాలు కూడా జరిగాయట. అయితే అందుకు షర్మిల ససేమిరా ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిద్దరూ వేరు వేరుగానే వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నేడు నివాళులు అర్పించారు.
తొలుత ఘాట్ దగ్గరకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వారంతా కలిసి వైఎస్ఆర్ సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు. తర్వాత అక్కడి నుంచి జగన్(JAGAN) తదితరులు వెళ్లిపోయారు. విజయమ్మ మాత్రం అక్కడే ఉన్నారు. అనంతరం షర్మిల, బ్రదర్ అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెలు అక్కడికి చేరుకున్నారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించారు. వెంటనే అక్కడి నుంచి విజయవాడకు వెళ్లిపోయారు.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పరాజయం పాలైంది. అలాగే షర్మిల నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయం చవి చూసింది. ఈ పరిణామాల తర్వాత అయినా వీరి కుటుంబాలు కలుస్తాయేమోనని అంతా భావించారు. అయితే ఈ ఘటనతో వారి మధ్య ఇంకా సత్సంబంధాలు నెలకొనలేదని తేలతెల్లం అయ్యింది. ఇదిలా ఉండగా వైఎస్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విజయవాడలో ఈ కార్యక్రమం నేడు జరుగుతుంది.