ap assembly speaker : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో గెలుపొందిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం శుక్రవారం మొదలై కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం నియోజకర్గం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా(AP ASSEMBLY SPEAKER) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నేడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను సభా గౌరవానికి భంగం కలగకుండా తన బాధ్యతను నెరవేరుస్తానని అయ్యన్న పాత్రుడు(AYYANNA PATRUDU) అన్నారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ను ఎన్నుకుంటారు. అయితే ఈ పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేశారు. కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది.
స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో సాధారణంగా అన్ని పార్టీలు కలిసి పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అంతా కలిసి స్పీకర్ని తొలిసారి సభాధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అయితే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గోకూడదని నిశ్చయించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి శుక్రవారం అసెంబ్లీకి హాజరైనా ప్రమాణ స్వీకారాల సమయంలో తన పేరు వచ్చే వరకు సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టలేదు. ఆ తర్వాత కూడా తన ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. శనివారం జరిగే స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ఆనవాయితీని పాటించకుండా వ్యవహరిస్తున్నారు.