AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభను వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈసారి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
సాధారణ సమాచారం మేరకు ఈ నెల 26 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. అలాగే గవర్నర్ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. సభ్యులు వీటిపై చర్చించే అవకాశముంది.