గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భద్రాచలంలో గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాల్చి 43 అడుగులు దాటింది, కలెక్టర్ ఆదేశాలు ప్రకారం మొదటి ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు.
ఆదివారం తెలంగాణ లో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాల్లోకి వెళితే…
కరీంనగర్ జిల్లా బోర్నవల్లిలో 7 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా శాయంపేట 7. 08, హనుమకొండ జిల్లా పులకుర్తి 7.20, ములుగు జిల్లా మేడారం 7. 53, ములుగు వెంకటాపూర్ 7. 55, హనుమకొండ నాగారం 8. 03, హనుమకొండ కమలాపూర్ 8. 38, ములుగు జిల్లా ఆలుబాక 10. 15, మల్లంపల్లి 11. 73., అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరునాగారం లో 12. 73 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది.
మరోప్రక్క ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా ఉత్తరాంధ్రలో వరద ప్రభావం వలన, ఎగువ రాష్ట్రాల్లో వర్ష ప్రభావం వలన గోదావరి ప్రవాహం తీవ్రత పెరుగుతుంది. ధవళేశ్వరం వద్ద 7. 72 లక్షల క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదులుతున్నారు. ఒడిశాపై కొనసాగుతున్న అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని, ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయి వాతావరణ శాఖ తెలిపింది