»Ap Rains Submerged Gandipochamma Temple At Devipatnam
AP Rains: దేవీపట్నంలో మునిగిన గండిపోచమ్మ ఆలయం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
AP Rains: Submerged Gandipochamma temple at Devipatnam
AP Rains: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రవహిస్తోంది.
చట్టి వద్ద జాతీయ రహదారి-30 పైకి శబరి నది వరద చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి, నిమ్మలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా-ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర వరద నీరు చేరింది. చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 38.1 అడుగులకు చేరింది.
డొంకరాయి జలాశయం నిండుకుండలా మారింది. దీని గరిష్ఠ నీటిమట్టం 940 అడుగులు కాగా.. ప్రస్తుతం 939.50 అడుగులకు చేరుకుంది. సోకులేరు, చీకటి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చింతూరు-వరరామచంద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో వరద ఉద్ధృతి పెరిగింది. నదుల ఉద్ధృతితో కూనవరం మండలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల వల్ల కూనవరం-భద్రాచలం, భద్రాచలం-చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.