»Telangana Group Politics Again In Tpcc Seniors Fire On Revanth Reddy
అన్ని ఆయన చేస్తే ఇక మేమెందుకు? Revanth Reddyపై సీనియర్లు రుసరుస
కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రకటించిన కార్యాచరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక తామెందుకు అని పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి దెబ్బకు నల్లగొండలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమం వాయిదా పడింది.
దేశంలో ఏ పార్టీలోనైనా పరిస్థితులు చక్కబడుతాయి కానీ కాంగ్రెస్ పార్టీలో (Congress Party) మాత్రం చక్కబడవు. ఆ పార్టీలో నిత్యం కుంపటి రాజకీయాలు (Group Politics) కొనసాగడం సర్వసాధారణం. పార్టీ మునిగిపోతున్నా పోనీ కానీ మా పట్టింపులే ముఖ్యమన్నట్టు నాయకుల ప్రవర్తన ఉంది. దీని ఫలితంగానే పార్టీ విజయాలు సాధించలేకపోతుంది. తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో విభేదాలు రచ్చకెక్కాయి. మళ్లీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) సీనియర్లు గుర్రుమన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ (Incharge)కు ఫిర్యాదులు చేశారు. తమకు తెలియకుండా పార్టీ కార్యాచరణ రూపొందించారని మండిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ (TSPSC Question Papers Leakage) పై ఆందోళనలు చేపట్టాలని పీసీసీ (TPCC) కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుద్యోగ నిరసన సభల పేరిట ఈనెల 21న నల్గొండ, 24న ఖమ్మం, 26వ తేదీన ఆదిలాబాద్ లలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట ప్రకటించారు. ఈ సభలకు కొనసాగింపుగా మే 4 లేదా 5వ తేదీన సరూర్ నగర్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ సభకు పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాజరవుతారని వివరించారు.
అయితే ఈ కార్యక్రమాలపై తమకు సమాచారం లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ‘మీడియాలో చూశాను తప్పితే పార్టీ నుంచి అధికారికంగా సమాచారం లేదు’ అని తెలిపారు. నల్లగొండ సభ తేదీ మార్చాలని ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కోరడంతో సభను పీసీసీ వాయిదా వేసింది. కాగా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre)కు కొందరు నాయకులు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఈ సభలు నిర్వహించాలనే దానిపై తమతో పీసీసీ చర్చలు జరపలేదని ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ నాయకులు చెబుతున్నారు. ఈ సభలపై ముందుగా తమకు చెప్పి ఎందుకు చర్చించలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అందరితో చర్చించకుండా ఏకపక్షంగా తేదీలు ఖరారు చేస్తే ఎలా విజయవంతమవుతాయని అడుగుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే.. ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇక తామెందుకు అని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో జరిగిన సభలో సీనియర నాయకులు బల ప్రదర్శన చేశారు. ఆ సభలో రేవంత్ వర్గం, సీనియర్లు ఒక వర్గంగా కనిపించారు. మరి ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వస్తే పార్టీని గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇలాగే గ్రూపు రాజకీయాలతో ఎన్నికలకు వెళ్తే మూడోసారి చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదు.