»Telangana Mlc Patnam Mahender Reddy Gives Clarity On Party Changing
లేదు లేదు.. నేను BJPలోకి పోవట్లే.. పట్నం మహేందర్ రెడ్డి
ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దివంగత ఇంద్రారెడ్డికి మేనల్లుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కీలక నాయకుడు. ఈ పుకార్లపై కేటీఆర్ కు వివరణ ఇచ్చా. దీనిపై స్పష్టత ఇచ్చాను.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎండలకు తగ్గట్టుగానే తెలంగాణ (Telangana) రాజకీయ వాతావరణం హాట్ హాట్ గానే ఉంది. ఈ క్రమంలోనే పార్టీలు జిమ్మిక్కులు, కుట్రలకు తెరలేపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకులను చేర్చుకునేందుకు లేని పోని వార్తలను (Fake News) కల్పిస్తారు. అలా ఉమ్మడి రంగారెడ్డి (RangaReddy District) జిల్లాలో కీలక నాయకుడు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి (Patnam Mahender Reddy) బీజేపీ గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి పార్టీ మారుతాడనే ప్రచారం కలకలం రేపింది. త్వరలోనే అమిత్ షా చేవెళ్లలో (Chevella) పర్యటిస్తున్న నేపథ్యంలో అతడి పార్టీ మార్పుపై చర్చ జరిగింది. ఈ పుకార్లు తన దృష్టికి రావడంతో పట్నం మహేంద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీ మారేది లేదని కుండబద్దలు కొట్టారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో పార్టీ మార్పుపై పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది నాపై బీజేపీ చేరుతానని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. కొందరు రాయిస్తున్నారని నాకు తెలుసు. ఇది తప్పు. నేను బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిని. ఎట్టి పరిస్థితిలో పార్టీ మారేది లేదు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అలాంటి పార్టీలో నేను చేరను. ఈ పుకార్లపై కేటీఆర్ (KT Rama Rao)కు వివరణ ఇచ్చా. దీనిపై స్పష్టత ఇచ్చాను. నేను గతంలో మంత్రిగా కూడా చేశా. ఎవరూ ఎన్ని చెప్పినా నేను పార్టీ మారేది లేదు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నేను ముందుకు నడుస్తున్నా. నాకు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో నాగర్ కర్నూల్ (NagarKurnool) వెళ్తున్నా. పార్టీ కార్యక్రమాలు ఉండడంతో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంతే. త్వరలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను చేపడతా’ అని మహేందర్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కీలక నాయకుడు. ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దివంగత ఇంద్రారెడ్డికి మేనల్లుడు. 1994లో తాండూరు నుంచి తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యాడు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ లో చేరాడు. అనంతరం సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 ఎన్నికల్లో అనూహ్యంగా పైలెట్ రోహిత్ రెడ్డి (Rohith Reddy) చేతిలో మహేందర్ రెడ్డి పరాజయం పొందాడు. అనంతరం ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. అతడి భార్య సునీతారెడ్డి (Patnam Sunitha Mahender Reddy) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. అతడి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.