»Young Couple Committed Suicide On Railway Track In Kadapa Wife 8 Months Pregnant
Kadapaలో యువ దంపతుల బలవన్మరణం.. భార్య 8 నెలల గర్భిణి
నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని తెలుస్తున్నది
మంచి కుటుంబం.. చక్కటి అనుబంధం.. భార్యాభర్తలు చూడముచ్చటగా ఉన్నారు. వ్యాపారంతో సాఫీగా సాగుతున్న సంసారంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎంతలా అంటే కొద్ది నెలల్లో తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసీ కూడా అంతవరకు వాళ్లు తాళలేకపోయారు. సమస్యలు చుట్టుముట్టడంతో పుట్టబోయే బిడ్డతోపాటు ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలు ఎనిమిది నెలల గర్భవతి కావడం గమనార్హం. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని కడపకు చెందిన సాయికుమార్ రెడ్డి, హేమమాలినికి గతేడాది వివాహం జరిగింది. వీరిద్దరూ పట్టణంలోని విజయదుర్గా కాలనీలో కాపురం పెట్టారు. వ్యాపారాలు చేస్తూ సాయి కుమార్ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. వాటిని తీర్చలేక దంపతులు బాధపడుతున్నారు. ఈ సమయంలోనే భార్య హేమమాలిని గర్భం దాల్చింది. ఇంకా సమస్యలు అధికం కావడంతో భార్యాభర్తలు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రైలు పట్టాలకు చేరుకున్నారు. ఆ సమయంలో వచ్చిన రైలు కింద పడి సాయికుమార్, హేమమాలిని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరు అప్పుల బాధ భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. అయితే నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని కుటుంబసభ్యులు వాపోయారు.