YS Sharmila : పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి దివంగత నేత వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ కేసులకు సంబంధించి తొలుత సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరు లేదన్నారు. కావాలని కుట్ర పూరితంగా వైఎస్సార్ పేరు చేర్చారన్నారు. స్వయంగా ఈ విషయాన్ని సోనియాగాంధీనే తనతో చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చిందని జగన్ గతంలో ఆరోపించారు. కానీ, ఆయన సీఎం అయిన వారంలోపే సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవి వచ్చింది. జగన్ ఆదేశాలు లేకుండానే పొన్నవోలుకు ఏఏజీ పదవి వచ్చిందా? అని ప్రశ్నించారు. కేసుల నుంచి జగన్ బయటపడాలంటే ఛార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరు ఉండేలా చూశారన్నారు.
వైఎస్సార్ విషయంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టిన మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి సీఎం అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ (అడిషినల్ అడ్వకేట్ జనరల్) పదవి ఇచ్చారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురైతే అందులో చంద్రబాబు హస్తం ఉందని ఆనాడు జగన్ ఆరోపించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కానీ, జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని ఆయనే స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబు తనను కంట్రోలు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని దుర్మార్గంగా ఆరోపిస్తున్నారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తోంటే తనకు భయమేస్తోందన్నారు. ఏది జరిగినా చంద్రబాబే కారణం అని ఆరోపిస్తున్నారు.